ePaper
Friday, November 13, 2026
ePaper
Homeతెలంగాణజర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి...

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి…

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి…

హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి… టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ.

అర్జున్ సమాచారం.నవంబర్ 13,మంథని, రిపోర్టర్.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ద్వారా అందించే ఆర్థిక పరిహారం, పెన్షన్‌ను పెంచాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇటీవల మంథనికి చెందిన సీనియర్ పాత్రికేయుడు పెండ్యాల రామ్ కుమార్ మృతిచెందడంతో గురువారం ఆయన కుటుంబాన్ని విరాహత్ అలీ పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మంథని ప్రెస్ క్లబ్‌ను సందర్శించి పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమాలకు ఎందరో నాయకులను అందించిన ఘనత మంథని ప్రాంతానికి ఉందన్నారు. నీతి, నిజాయితీతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే జర్నలిస్టులంతా ఐక్యంగా ముందుకు సాగేందుకు మంథని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న కార్యకలాపాలు ఇతర ప్రాంతాల్లోని ప్రెస్ క్లబ్బులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం జర్నలిస్టులు ఎవరు? జర్నలిజం అంటే ఏమిటి? అని వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, కొందరు మీడియా సంస్థలతో సంబంధం లేకుండా ప్రెస్ క్లబ్బుల పేరుతో గందరగోళం సృష్టిస్తూ జర్నలిజం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులంతా ఏకమై మంథని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో ప్రెస్ క్లబ్ మరింత పటిష్టంగా ఎదగాలని, సొంత భవన నిర్మాణానికి సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

జర్నలిస్టులు వృత్తిపరంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆరోగ్య భద్రత, సొంత ఇంటి కల నేటికీ నెరవేరని సమస్యలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తగిన భరోసా కల్పించాలన్నారు. అర్హులైన వారందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించి వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. జర్నలిస్టులు మృతిచెందిన సందర్భాల్లో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రెస్ అకాడమీ అందించే పరిహారాన్ని, అర్హులైన కుటుంబాలకు ఇచ్చే పెన్షన్‌ను గణనీయంగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించకుండా దశలవారీగా అమలు చేయాలని కోరారు. జర్నలిస్టు సంఘాల తరఫున ఇప్పటికే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కారం సాధించే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం మంథని మండలం గాజులపల్లి గ్రామంలో అల్లం బుచ్చమ్మ మృతిచెందడంతో ఆమె కుమారులు అల్లం రాజయ్య, వీరయ్య, నారాయణలను పరామర్శించి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఉపాధ్యక్షుడు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, కోశాధికారి తగరం రాజు, సహాయ కార్యదర్శి గంధం ఆంజనేయులు, సీనియర్ జర్నలిస్టులు కోమురోజు మారుతి, కొమురోజు చంద్రమోహన్, బాసాని సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!