పోలీసు అమరులు చేసిన త్యాగాలు మరువలేనివి,
అమరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, పోలీసు శాఖ, సమాజం అండగా వుంటాయి
సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్,అక్టోబరు 21.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినమైన అక్టోబర్ 21 ఎంతో భావోద్వేగమైన రోజని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల భద్రత, సమాజ రక్షణ కోసం పోలీసు అమరులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, పోలీసుల సంక్షేమం, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అమరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపుతో పాటు, అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత విద్య, వైద్య సహాయం అందిస్తున్నామని, పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామని వివరించారు.
మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలి. బాధితులకు న్యాయం అందించడంలో జాప్యం జరగకూడదు. మహిళల భద్రత కేవలం పోలీసు శాఖ బాధ్యత కాదు.. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి . పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిని మీ కుటుంబ సభ్యుల్లాగా చూడండి. అలా అయితేనే మీరు బాధ్యతగా వ్యవహరిస్తారు. నూటికి నూరు శాతం సమస్యకు పరిష్కారం చూపిస్తారని అన్నారు.
సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆహారం కల్తీ వంటి మారుతున్న నేర స్వభావాలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసు అమరుల త్యాగాలను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తూ శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్పీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, శాంతి భద్రతల ప్రాధాన్యత, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.
అమరుల కుటుంబ సభ్యులకు ఒక మాట చెబుతున్నాను. మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ, సమాజం మీకు అండగా ఉంటాయని అన్నారు.
ఈ ఏడాది అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

