కాంగ్రెస్ మోసాలపై కదం తొక్కాలే.. బీఆర్ఎస్ సమరభేరి మ్రోగించాలేసెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపు.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 29:
అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఆ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. శనివారం మంథని పట్టణంలోని రాజగృహాలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి ప్రతి మండల కేంద్రంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి వేయి రోజులు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
ఓట్ల కోసం ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డులు ఇచ్చారని, ఇప్పుడు అదే కార్డులను చేతబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు తీరును ప్రతి నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు మండల కేంద్రాల్లో విస్తృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సమరభేరి మ్రోగించాలని పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.

