ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అర్నబ్ తుపాను నష్టంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సాయం కోరుతూ విజ్ఞప్తి ...

అర్నబ్ తుపాను నష్టంపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. తక్షణ సాయం కోరుతూ విజ్ఞప్తి అర్నబ్ తుపాను నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ న ష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి ప్రాథమిక అంచనాల ప్రకారం భారీగా పంట, ఆస్తి నష్టం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు ముందస్తు చర్యల కారణంగా ప్రాణనష్టాన్ని నివారించినట్టు వెల్లడి

📰 Generate e-Paper Clip

విజయవాడ,అర్జున్ సమాచారం:
ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను చూపిన ప్రభావం, రాష్ట్రంలో వాటిల్లిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని, నష్టాన్ని అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తుపాను తీవ్రత, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీఎం తన లేఖలో వివరించారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు.  ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తీర ప్రాంతాల్లో అనేక రహదారులు ధ్వంసం కాగా, సుమారు 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని వెల్లడించారు. దీనివల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ఇప్పటివరకు ఎక్కడా ప్రాణనష్టం నమోదు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తుపాను ప్రభావిత 14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల నుంచి 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ప్రజలకు సహాయ చర్యలు అందించడం, విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ కేంద్రం నిరంతరం పనిచేస్తున్నాయని వివరించారు. తుఫాను నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇతర కేంద్ర సంస్థల సహకారం ఇలాగే కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని పంపాలని అమిత్ షాను ఆయన మరోసారి కోరారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!