తిరుపతి, జూలై 15,అర్జున్ సమాచారం:
జిల్లాలో ఇసుక, కంకర (గ్రావెల్) అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ మిని కాన్ఫిరెన్స్ హాలు నందు రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో ఇసుక, కంకర తవ్వకాల నియంత్రణ, అనుమతులు, రవాణా, పర్యవేక్షణ, అమలు చర్యలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంయుక్తంగా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక, కంకర తవ్వకాలు, అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే తవ్వకాలు, రవాణా జరిగేలా క్షేత్రస్థాయిలో పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అనుమతులు పొందిన ఇసుక రీచ్‌లు, క్వారీల నుంచి ఖనిజాలను తరలించే ప్రతి వాహనానికి సంబంధిత అనుమతి పత్రాన్ని (పర్మిట్) విండ్ స్క్రీన్‌పై తప్పనిసరిగా ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల నమోదు సంఖ్యలతో కూడిన పూర్తి జాబితాను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు అందజేయాలని సూచించారు. ప్రతి వాహనం ఆన్లైన్ బిల్లు, అనుమతి పత్రాలతోనే రవాణా చేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్, రవాణా శాఖలు పరస్పర సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అనుమతులు లేని వాహనాలు, అక్రమ తవ్వకాలపై తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా సమర్థవంతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సంయుక్త టాస్క్‌ఫోర్స్‌గా పనిచేసి అందిన ప్రతి సమాచారంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెక్‌పోస్టులు, కీలక రహదారుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని తెలిపారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంతో పాటు ఇతర జలవనరుల వద్ద అనుమతించిన హద్దులను దాటి ఇసుక తవ్వకాలు జరగకుండా నీటిపారుదల, రెవెన్యూ శాఖలు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన రీచ్‌లు, వాహనాలపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి పొందిన రీచ్‌కు చెందిన వాహనం అక్రమ రవాణాలో పట్టుబడితే సంబంధిత రీచ్ అనుమతిని రద్దు చేయడంతో పాటు అవసరమైతే తాత్కాలికంగా సస్పెండ్ చేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. స్థానిక ప్రజల గృహ నిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు జరిగే చిన్నస్థాయి ఇసుక రవాణాకు ఇబ్బందులు కలిగించవద్దని, అయితే పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు, డంపింగ్ చేసి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు మాట్లాడుతూ అక్రమ ఇసుక, కంకర రవాణా పై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలతో సమన్వయం చేసుకుని సంయుక్త దాడులు నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ రవాణా, తవ్వకాలలో పాల్గొనే వ్యక్తులు, వాహనాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిబంధనలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లాలో ఇసుక, కంకర అవసరాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సరఫరా, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు అవసరమైన ఖనిజాల లభ్యత, అనుమతుల ప్రక్రియ, అక్రమ తవ్వకాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, శాఖల వారీగా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థపై సవివరంగా చర్చించారు.
ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్, భానుప్రకాశ్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, జిల్లా రవాణా అధికారి మురళీ మోహన్, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్లు (తిరుపతి, చిత్తూరు నెల్లూరు, చెన్నై), నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఈఈలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
====================

