కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
సింగరేణిలో జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టియుసి యూనియన్ల వైఫల్యం కారణంగానే కార్మికులు బొగ్గు ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, వైద్యం తదితర అన్ని అంశాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రామగిరి మండలం సెంట్రింగ్ కాలనీ ఆర్జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వద్ద టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య ఫిట్ సెక్రెటరీ వివి గౌడ్, బ్రాంచ్ సెక్రటరీ తిప్పారపు తేజ నేతృత్వంలో గేట్ మీటింగ్ నిర్వహించగా ఓవర్ మెన్లు రాజేందర్, అనిల్ రామ్ తోపాటు పెద్ద సంఖ్యలో కార్మికులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిర్యాల రాజిరెడ్డి వారందరికీ గులాబి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి కార్మికుల ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికులకు పని స్థలాలలో సరైన వసతులను సమకూర్చడంలో విఫలమవుతున్నదన్నారు. నాణ్యమైన పనిముట్ల సైతం అందించడం లేదని అవసరానికి తగ్గ సిబ్బందిని నియమించక పని భారాన్ని పెంచుతున్నదన్నారు. డ్రిల్ బిట్లు ఇవ్వడం లేదని చాలా రోజుల నుండి బూట్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, మ్యాన్ రైడింగ్ సమస్యలు తీర్చలేకపోతున్నారని, నీటి సమస్యలు కూడా ఉన్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్లు వివరించారు. అధికారులు వెంటనే స్పందించి గనిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సమావేశ అనంతరం మేనేజర్ పెంచలయ్య ని కోరారు
==============================

