అర్జున్ సమాచారం:
అమెరికా క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలోని కొందరు మంత్రులకు ఇప్పుడు ప్రాణభయం పట్టుకొంది. ఇరాన్ డర్టీబాంబ్ ప్రయోగం కోసం తీవ్రంగా యత్నిస్తోందన్న ఇంటెలిజెన్స్ సమాచారం వారిలో గుబులు పుట్టించింది. దీంతో విలాసవంతమైన తమ ఇళ్లను వదిలి జనాలకు దూరంగా ఉండే సైనిక స్థావరాల్లో జనరల్స్ కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్నారు. వీటి కోసం 5% అదనపు అద్దెను కూడా చెల్లిస్తున్నారు. ట్రంప్ కార్యవర్గంలోని మంత్రులు సహా ఆరుగురు కీలక వ్యక్తులు.. వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ హౌసింగ్‌లోకి తమ నివాసాలను మార్చుకొన్నారు. ఇరాన్, హూతీల నుంచి బెదిరింపులు పెరగడం.. ట్రంప్ కార్యవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని డర్టీబాంబ్, రసాయన ఆయుధాల ప్రయోగ కుట్రలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికల వంటివి వీరి నిర్ణయాలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. గత అధ్యక్షుల సమయంలో ఎన్నడూ ఈ స్థాయిలో మంత్రులు, అధికారులు మిలిటరీ స్థావరాల్లో నివాసం ఉండలేదు.
రక్షణ, ఆర్థిక మంత్రులు కూడా..: ఇటీవల అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సైనిక స్థావరంలోకి మారడంతో ఈ అంశం బాగా వార్తల్లో నిలిచింది. ఇరాన్ నుంచి ముప్పు ఉండటంతోనే తాను ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం బెసెంట్ కనుసన్నల్లోనే జరుగుతోంది. టెహ్రాన్‌పై ఆయన విడతలవారీగా తీవ్ర ఆంక్షలు విధించారు. ఇక రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా సైనిక స్థావరంలోనే ఉంటున్నారు. ఆయన ఉన్న ఫోర్ట్‌మెక్‌నైర్‌కు గతేడాది మరమ్మతుల కోసమే 1.3లక్షల డాలర్లు వెచ్చించేందుకు సిద్ధం కావడం వివాదాస్పదమైంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా కుటుంబంతో కలిసి ఇక్కడే ఉంటారు. హెగ్సెత్, రూబియో ఇక్కడ జనరల్స్ నివాసాల వరుసలో ఇరుగు పొరుగు కావడం విశేషం. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ కూడా సైనిక స్థావరంలోకి మారారు. గత అటార్నీ జనరల్ పామ్ బాండీ కూడా ఇలానే నివాసం ఉన్నారు. ప్రస్తుత వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ సైతం మిలిటరీ బేస్‌లోకి మారారు. ఆయన ఇంటి ఎదుట ఇటీవల ఆందోళనలు జరగడంతో పిల్లలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి వచ్చేశారు.
మంత్రులు మిలిటరీ స్థావరాల్లో ఉండొచ్చా..?: ముప్పును ఎదుర్కొంటున్న పౌర అధికారుల ఇళ్ల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి జీతాలు ఇవ్వడం కంటే.. నేరుగా ఆ అధికారులకే మిలిటరీ స్థావరాల్లో ఇళ్లను కేటాయించడమే చౌక అని పెంటగాన్ వాదించి మరీ గతంలో చట్టంలో మార్పు చేయించింది. ఇలా నివాసం ఉండేవారు ఫోర్ స్టార్ జనరల్, అడ్మిరల్స్ చెల్లించే అద్దె కంటే 5శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దె ప్రస్తుతం 4,500 డాలర్లుగా (రూ.3.5 లక్షలకు పైగా) ఉంది. ఈ రేటు పరిస్థితిని బట్టి మార్చొచ్చు. ట్రంప్ తొలిసారి అధికారం చేపట్టిన సమయంలోనూ పలువురు మంత్రులు మిలిటరీ స్థావరాల్లో ఉన్నారు.
=========================
డర్టీబాంబ్ గుబులు ఇళ్లను వీడి సైనిక స్థావరాలకు అమెరికా మంత్రులు..!
RELATED ARTICLES

