ePaper
Friday, November 27, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంరియాద్‌పై హౌతీల డ్రోన్ దాడికి సౌదీ ప్రతీకారం - యెమెన్ రాజధాని సనాపై విరుచుకుపడ్డ సంకీర్ణ...

రియాద్‌పై హౌతీల డ్రోన్ దాడికి సౌదీ ప్రతీకారం – యెమెన్ రాజధాని సనాపై విరుచుకుపడ్డ సంకీర్ణ దళాలు – సౌదీ సార్వభౌమత్వానికి భంగమంటూ అరబ్ దేశాల ఖండన – హౌతీ గ్రూప్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన బ్రిటన్ – 24 గంటల్లో 72 దాడులు జరిగాయని హౌతీల ఆరోపణ

📰 Generate e-Paper Clip

 అర్జున్ సమాచారం:
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి పాల్పడిన కొన్ని గంటల్లోనే యెమెన్‌లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతీకారంగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మంగళవారం రాత్రి యెమెన్ రాజధాని సనాపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ పోటాపోటీ దాడులతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సౌదీ బలగాలు దాడులు చేసినట్లు హౌతీలకు చెందిన అల్-మసిరా టీవీ వెల్లడించింది. ఈ దాడుల కారణంగా భారీ పేలుళ్లు సంభవించాయని, సమీపంలోని ఇళ్ల కిటికీలు కంపించిపోయాయని స్థానికులు తెలిపారు. గత 24 గంటల్లో సౌదీ దళాలు యెమెన్‌పై 72 వైమానిక, క్షిపణి దాడులకు పాల్పడ్డాయని, ఈ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరియా ఆరోపించారు. అంతకుముందు, రియాద్‌లోని ఫైనాన్షియల్ సెంటర్‌ టవర్లలో ఒకదానిపై హౌతీలు “పిరికిపంద చర్యకు” పాల్పడ్డారని సౌదీ సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్-మాలికి ప్రకటించారు. డ్రోన్‌తో ఈ దాడి జరిగిందని, పౌరులను, పౌర ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీలకు గట్టిగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. సౌదీపై జరిగిన ఈ దాడిని యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, అరబ్ లీగ్ తీవ్రంగా ఖండించాయి. ఇది సౌదీ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు కలిగించే చర్య అని అభివర్ణించాయి. మరోవైపు, యెమెన్‌లో సైనిక కార్యకలాపాలను తీవ్రతరం చేయడం, అంతర్జాతీయ నౌకలపై దాడులకు పాల్పడటం వంటి కారణాలతో హౌతీ గ్రూప్‌పైనా, దాని నలుగురు నేతలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, సౌదీ అరేబియా చేస్తున్న నేరాలను బ్రిటన్ చట్టబద్ధం చేస్తోందని ఆరోపిస్తూ హౌతీలు ఈ ఆంక్షలను తిరస్కరించాయి.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!