ePaper
Thursday, November 26, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంహసీనాకు పాస్‌పోర్ట్ నిరాకరణ.. అరెస్ట్‌కు సిద్ధమైన బంగ్లాదేశ్ ప్రభుత్వం - డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి...

హసీనాకు పాస్‌పోర్ట్ నిరాకరణ.. అరెస్ట్‌కు సిద్ధమైన బంగ్లాదేశ్ ప్రభుత్వం – డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వస్తానన్న మాజీ ప్రధాని షేక్ హసీనా – పాస్‌పోర్ట్, ప్రయాణ పత్రాలు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన బంగ్లా ప్రభుత్వం = దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తామని మంత్రుల హెచ్చరిక – హసీనా రాకపై చర్చలు భారత్‌తోనే ఉంటాయని బంగ్లాదేశ్ వెల్లడి – ఆగస్టు అల్లర్ల కేసులో హసీనాకు ఇప్పటికే మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్

📰 Generate e-Paper Clip

బంగ్లాదేశ్ :అర్జున్ సమాచారం:
బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విద్యార్థి ఉద్యమంతో పదవి కోల్పోయి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా (79), డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 1971 విమోచన యుద్ధ విజయానికి గుర్తుగా జరుపుకునే ‘విజయ్ దివస్’ (విజయ దినోత్సవం) రోజున తిరిగి రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అయితే, ఆమె రాకను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.   ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే భారత్‌కు వెళ్లినందున, తిరిగి ఢాకా వచ్చేందుకు కూడా జాతీయ విమానయాన సంస్థ ‘బిమాన్ బంగ్లాదేశ్’ విమానాన్ని ఏర్పాటు చేయాలని హసీనా ప్రతినిధి అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. కానీ, ఈ అభ్యర్థనను బంగ్లా ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశం విడిచి వెళ్లాక హసీనా పాస్‌పోర్ట్‌ను రద్దు చేశామని, కొత్తగా ఎలాంటి ప్రయాణ పత్రాలు జారీ చేసేది లేదని తేల్చిచెప్పింది. కొత్త పాస్‌పోర్ట్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించింది. మరోవైపు, హసీనా స్వదేశంలో అడుగుపెడితే అరెస్ట్ తప్పదని బంగ్లాదేశ్ మంత్రులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 2024 నాటి అల్లర్లలో నిరసనకారుల మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో దాఖలైన కేసులో, గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును హసీనా ఖండించారు. “ఆమెను అప్పగింత ఒప్పందం ప్రకారమే తీసుకువస్తాం. తిరిగి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపుతాం” అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ కబీర్ స్పష్టం చేశారు. ఆమె దేశ భూభాగంలోకి ఎక్కడ అడుగుపెట్టినా అరెస్ట్ చేస్తామని మరో మంత్రి షామా ఒబైద్ తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్ 29, 30 తేదీల్లో 48 గంటల దేశవ్యాప్త బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయంపై హసీనాతో కాకుండా నేరుగా భారత్‌తోనే చర్చిస్తామని బంగ్లా ప్రధాని సలహాదారు పేర్కొనడం గమనార్హం. హసీనా అప్పగింత అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు భారత్ గతంలోనే తెలిపింది. ఈ పరిణామాల మధ్య డిసెంబర్ 16న ఏం జరగనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!