ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeసినిమాడాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవిపై దాడి ▪️ *జనరల్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత* ▪️...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవిపై దాడి ▪️ *జనరల్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత* ▪️ *చంపుతామని బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు*

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.  తోపులాట, కేకలతో ఫిల్మ్‌ఛాంబర్ ఆవరణ ఒక్కసారిగా రణరంగంగా మారిపోవడంతో తోటి సినీ కార్మికులు, పరిశ్రమ పెద్దలు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇందిరానగర్‌లోని రాఘవ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు అసోసియేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులను అక్రమంగా తీసుకెళ్లేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారని సుమలతా దేవి ఆరోపించారు.
*రికార్డులు తీసుకెళ్లేందుకు యత్నం*
మినిట్స్ బుక్, అజెండా పత్రాలు, ఇతర ముఖ్యమైన అసోసియేషన్ రికార్డులను కొందరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో కొందరు మహిళలు, ఇతర వ్యక్తులు తనను చుట్టుముట్టి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో పాటు అడ్డుకునేందుకు ప్రయత్నించిన అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఎం. రాములు, సమిలి అనే మహిళపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు ఆరోపించారు.
*పలువురిపై ఆరోపణలు*
రఘు మాస్టర్ తరఫున ఉన్న కొందరు లేడీ డ్యాన్సర్లు తనపై పథకం ప్రకారమే మూకుమ్మడిగా దాడి చేశారని, తనను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో లిఖిత, పూజిత, కళ్యాణి, సుమతి, విమల, కోకిల, మాధుర్య, శృతి, శ్రీదేవి, ఏడుకొండల శ్రీను తదితరులు పాల్గొన్నట్లు ఫిర్యాదులో సుమలతా దేవి పేర్కొన్నారు. అదేవిధంగా శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, భాను మాస్టర్, అజయ్ సాయి మాస్టర్, జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ తదితరులు మరో అసోసియేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రస్తుత అసోసియేషన్‌లో విభేదాలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాల వెనుక ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్రోత్సాహం, పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
*పదవికి రాజీనామా చేయాలని బెదిరింపులు?*
తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామని కొందరు తీవ్రంగా బెదిరించినట్లు సుమలతా దేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
*సీసీటీవీ, మొబైల్ వీడియోలు పరిశీలించాలని విజ్ఞప్తి*
ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి రాఘవ గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజ్, సమావేశానికి సంబంధించిన మొబైల్ వీడియోలు, ఆడియో రికార్డులను సేకరించి పరిశీలించాలని ఆమె పోలీసులను కోరారు. అలాగే తీకెళ్లినట్లు ఆరోపిస్తున్న మినిట్స్ బుక్, అజెండా పత్రాలు, ఇతర అసోసియేషన్ రికార్డులను రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
దాడికి పాల్పడిన వారిపై బీఎన్‌ఎస్‌ (BNS)తో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, ఘటన వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్న వ్యక్తుల పాత్రపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని సుమలతా దేవి పోలీసులను కోరారు.
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!