ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeతెలంగాణమురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వానలు.. తెలంగాణకు మురసు తుపాను ముప్పు ...

మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వానలు.. తెలంగాణకు మురసు తుపాను ముప్పు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

📰 Generate e-Paper Clip

 అర్జున్ సమాచారం:
హైదరాబాద్:
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మంగళవారం కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. తుపాను ప్రభావంతో గంటల వ్యవధిలోనే వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మురసు తుపాను మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు–నరసాపురం మధ్య తీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉంది. అనంతరం బుధ, గురువారాల్లో మధ్య తెలంగాణ జిల్లాల వైపు కదులుతూ క్రమంగా బలహీనపడవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ రోజు ఏయే జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందనే వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్. స్టెల్లా వెల్లడించారు.
సోమవారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.
మంగళవారం వర్ష తీవ్రత మరింత పెరగనుందని చెప్పారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు.బుధవారం తుపాను ప్రభావం మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, కాలువల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!