అమరావతి,అర్జున్ సమాచారం:
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా బ్లాక్చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించింది. ప్రతి ల్యాండ్ పార్సెల్కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి టాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థ రూపకల్పన చేసారు. డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను పూర్తిగా నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం వుంటుంది. భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ గా ఉండేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్.
కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ అమలు అవనుంది. • ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు.
ఈ కార్యక్రమానికి మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హజరయ్యారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ల్యాండ్ లిటిగేషన్లు తక్కువే. కానీ గత ప్రభుత్వ విధానం వల్ల ఏపీలోనూ భూ తగాదాలు.. వివాదాలు పెరిగాయి. 22ఏ పేరుతో కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ప్రక్షాళన, విముక్తి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారించి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నాం.. రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం… పట్టాదార్ పాస్ పుస్తకాలు రాజముద్ర వేసి ఇస్తున్నాం. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములకు విముక్తి కల్పించాం. ఇప్పుడు ప్రారంభించిన మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థ ద్వారా భూములకు శాశ్వత భద్రత దక్కుతుంది. భూ రికార్డులకు సంబంధించి ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థను తెస్తున్నాం.. పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాం. బ్లాక్ చెయిన్ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే వేదిక మీదకు వస్తాయి… ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. రెండు నెలల పాటు ఈ పైలెట్ ప్రాజెక్టు అమలును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఈ వ్యవస్థ అమల్లో ఏమైనా లోటుపాట్లను వాటిని నమోదు చేసుకోవడానికి ఓ కంప్లైంట్ సెల్ పెట్టాలి… దానికి అనుగుణంగా బ్లాక్ చెయిన్ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి సర్వే పూర్తి అయిన గ్రామాలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వ్యవస్థలోకి వెళ్తాయి. నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలి భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భూ సమస్యలకు పరిష్కారం చూపితే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు.
==========================

