హైదరాబాద్,అర్జున్ సమాచారం:
దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు,3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 31 మంది సీఎంల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం, దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రులుగా దక్షిణాది నేతలే తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
రూ.1413 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మొదటి స్థానంలో ఉండగా, రూ.931 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్ రూ.648 కోట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.
క్రిమినల్ కేసుల విషయానికొస్తే, దేశంలోని ముఖ్యమంత్రులందరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ఆయనపై ఏకంగా 80 కేసులు ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. రేవంత్ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29 కేసులు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై 19 కేసులు ఉన్నాయి.19 కేసులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలోని 31 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో అత్యల్ప ఆస్తులు కలిగిన సీఎంగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలు నిలిచారు. మొత్తం 31 మంది సీఎంల మొత్తం ఆస్తుల విలువ రూ.8,660 కోట్లుగా ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది.
==========================

