ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్సివిల్ సర్వెంట్లపై ఏసీబీ గురి

సివిల్ సర్వెంట్లపై ఏసీబీ గురి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూలై 29,అర్జున్ సమాచారం:
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ   రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థాయిలో అక్రమార్కులైన అధికారులపై సమగ్ర  దోపిడీ చిట్టా ను సిద్ధం చేసి విరుచుకుపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో లేదా సురక్షితమైన లొసుగులను వాడుకుని లంచాల ఆరోపణల నుంచి తప్పించుకున్నామని భావిస్తున్న అనేక శాఖల అధికారుల పాత ఫైళ్లను ఏసీబీ తిరిగి తోడుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, ఇంజనీరింగ్ , జీహెచ్‌ఎంసీ, ఆర్‌టీఏ, పోలీసు శాఖల్లో క్వాసి-జ్యుడీషియల్ ,  సివిల్ అధికారాలను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు గడించిన ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తూ పక్కా ఆధారాలతో దాడులకు రంగం సిద్ధం చేసుకుంది.సాధారణంగా రాష్ట్ర ఏసీబీకి ఐఏఎస్ , ఐపీఎస్  వంటి అఖిల భారత సర్వీసు అధికారులపై దాడులు చేసే అధికారం ఉందా? అనే సాంకేతిక సందేహం కలగడం సహజం. చట్టపరంగా, నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం, ఐఏఎస్,ఐపీఎస్ అధికారులపై విచారణ లేదా దాడులు నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి   తప్పనిసరి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి సంపూర్ణ స్వేచ్ఛను  ఇవ్వడంతో పాటు, ముఖ్య కార్యదర్శి స్థాయి నుండి అవసరమైన చట్టబద్ధ ఆమోదాలు ముందస్తుగానే లభిస్తుండటంతో ఏసీబీకి సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. దీనివల్ల ప్రాథమిక ఆధారాలు ఉన్న ఏ స్థాయి ఉన్నతాధికారి ఇంటిపైనైనా దాడి చేసేందుకు ఏసీబీకి సర్వహక్కులు లభించాయి.ఈ విడత ఏసీబీ వ్యూహం గతంలో కంటే చాలా భిన్నంగా, అత్యంత శాస్త్రీయంగా ఉంది. దాదాపు 65 మందికి పైగా ఉన్నతాధికారుల జాబితాను తయారు చేసిన ఏసీబీ, వారి ఆదాయానికి మించిన ఆస్తుల  వివరాలను ఆరు నెలల పాటు నిఘా పెట్టి సేకరించింది. ఆస్తులను బినామీల పేరిట మార్చడం, రియల్ ఎస్టేట్ రంగాలు,  విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం వంటి సంక్లిష్టమైన నెట్‌వర్క్‌లను ఏసీబీ ఇంటెలిజెన్స్ ఛేదించింది. లంచం తీసుకుంటూ దొరికిపోయే “ట్రాప్” కేసులతో పాటు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపైనే ప్రధానంగా దృష్టి సారించడం వల్ల బ్యూరోక్రసీలోని కీలక స్థానాల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా రెవెన్యూ , ల్యాండ్ సర్వే విభాగాల్లోని క్వాసి-జ్యుడీషియల్ వివాదాలను పరిష్కరించే క్రమంలో అధికారులు వందల కోట్ల విలువైన వివాదాస్పద భూములను అక్రమంగా క్రమబద్ధీకరించిన ఆధారాలు ఏసీబీ చేతికి చిక్కాయి. పాత క్వాసి-జ్యుడీషియల్ ఆర్డర్లను, సివిల్ కాంట్రాక్టుల మంజూరు ఫైళ్లను తిరగదోడుతుండటంతో గతంలో కీలక పదవుల్లో పనిచేసి, ప్రస్తుతం లూప్‌లైన్ లేదా కీలక శాఖల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది. కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిపైనే కాకుండా, అవినీతి మూలాలైన ఉన్నతాధికారుల వైపు ఏసీబీ దృష్టి మళ్లడం పరిపాలనా యంత్రాంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది.
అంతేకాకుండా, ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా నేతృత్వంలో ఈ వ్యవస్థలోనే అంతర్గత ప్రక్షాళ వేగంగా జరుగుతోంది. దాడుల సమాచారం ముందుగానే లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత రహస్య బృందాలను రంగంలోకి దించడం, సోదాల సమయాన్ని డిజిటల్ సాక్ష్యాలుగా రికార్డు చేయడం వంటి సంస్కరణలు తెచ్చారు. గడిచిన కొద్ది నెలల్లోనే 190కి పైగా కేసులు నమోదు చేసి 14 ఏళ్ల రికార్డును తిరగరాయడం, ప్రభుత్వంలో రాజకీయ సంకల్పం స్పష్టంగా ఉందనడానికి నిదర్శనంగా మారుతోంది. ఈ క్రాక్‌డౌన్ కేవలం అక్రమార్కులను పట్టుకోవడానికే పరిమితం కాకుండా, రాష్ట్ర పౌర సేవల వ్యవస్థలో ఒక స్పష్టమైన హెచ్చరికను పంపడానికి  ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు మారినా, పాత అక్రమాలపై విచారణ తప్పదనే భావన అధికారుల్లో కలిగించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత తేగలమని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో వెలువడే ఐఏఎస్, ఐపీఎస్‌ల అరెస్టులు లేదా దాడుల వార్తలు తెలంగాణ రాజకీయ, పాలనా వర్గాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!