అర్జున్ సమాచారం:
ఇది పేదల ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడికి అన్యాయం చేయదని . పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రిమాట్లాడారు. 22ఏ నిషేధిత జాబితా వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోమారు స్పష్టం చేస్తూ సమస్య పరిష్కార ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని 24 గంటల్లోనే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 మొత్తం 34 రిజిస్ట్రేషన్లు జరిగాయని మంత్రి గారు వివరించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతోందని తెలిపారు.
బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పొరపాటును పారదర్శకంగా అంగీకరించి . అదే సమయంలో జరిగిన తప్పును సరిదిద్దే బాధ్యతను కూడా తీసుకున్నామని ప్రజలను ఇబ్బందుల్లో వదిలేసే ప్రభుత్వం తమది కాదని స్పష్టం చేశారు.
వివిధ జీవోలు, మెమోల ద్వారా గత ప్రభుత్వాల కాలంలో క్రమబద్ధీకరించబడిన ప్రైవేట్ భూములు, హైకోర్టు మరియు జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు ఆన్లైన్ అప్లోడింగ్లో సాంకేతిక లోపం కారణంగా 22ఏ జాబితాలోకి వచ్చాయని మంత్రి వివరించారు.ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించిందని, బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని తెలిపారు.
22ఏ సమస్యల త్వరిత పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి . జెన్యూన్ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇప్పుడు పేదవాడి సమస్యను రాజకీయంగా వాడుకోవడం మానేయండి. ఇది పేదల ప్రభుత్వం.. పేదల ఆశీస్సులతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వం. మేం తప్పును ఒప్పుకుని దిద్దుతున్నాం.. మీరు చేసిన తప్పులను ఒప్పుకునే ధైర్యం మీకుందా?” అని ప్రశ్నించారు. అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు.
తప్పు జరిగితే దాన్ని అధికారుల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే పొరపాటును అంగీకరించామన్నారు.
=============================

