అటవీ ప్రాంత సంరక్షణ కోసం సమన్వయంతో కృషి చేయాలిజిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రా.
నిజామాబాద్, ఆగస్టు20 :అర్జున్ సమాచారం ప్రతినిధి
జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలు, అటవీ భూముల ఆక్రమణల నిరోధం, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టడం, వనమహోత్సవం కింద విరివిగా మొక్కలు నాటడం, జల సంరక్షణ కార్యక్రమాల అమలు, వాల్టా చట్టం అమలు, అనువైన అటవీ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం తదితర అంశాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో అటవీ శాఖపరంగా నెలకొని ఉన్న పరిస్థితుల గురించి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో 20 శాతానికి పైగా 86947.11 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉందని తెలిపారు. అయితే, సిరికొండ, కమ్మర్పల్లి, కాల్పోల్ తండా, డీ.బీ.తండా, చందూర్ తదితర ప్రాంతాలలో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, కబ్జాదారులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల తోడ్పాటు అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, అటవీ ప్రాంత సంరక్షణకు ఆయా శాఖలు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు తప్పకుండా తగిన సహకారం అందించేలా చూస్తామన్నారు. అటవీ భూములను కబ్జా చేస్తే కఠిన చట్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆయా గ్రామాలలో విరివిగా సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అధికారులకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టాలని, చిరుతలు, ఇతర వన్యప్రాణులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్న చోట వాహనాల వేగాన్ని నియంత్రించేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అటవీ సంపద పరిరక్షణ కోసం జిల్లాలో అవసరమైన సరిహద్దు ప్రదేశాలలో చెక్ పోస్టుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. జల సంరక్షణ, భూగర్భ జల వనరుల పెంపు కోసం అటవీ ప్రాంతాలలో చెక్ డ్యాంలను నాణ్యతతో నిర్మించాలని, వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. ఆర్మూర్ నగర వాటిక, నిజామాబాద్ లోని ఖిల్లా, నందిపేట లోని ఎస్సారెస్పి బ్యాక్ వాటర్ ఏరియా, అంకాపూర్ లోని మోడల్ స్కూల్ తదితర చోట్ల అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలే, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, ట్రైనీ ఆర్డీఓ సందీప్, ఏ.సీ.పీలు ప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, అటవీ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు

