చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు:
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, అక్టోబర్ 06:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ నిరసన తెలిపినందుకు గాను తమపై అకారణంగా బనాయించిన కేసుల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు చెన్నూర్ లోని జూనియర్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వారిలో బీఆర్ఎస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్ గౌడ్, చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ భూక్య రాజకుమార్ నాయక్, మద్దికంటి మాజీ ఎంపిటిసి ఆత్కూరి రాము, మండల నాయకులు గుడిమల్ల వెంకటేశ్వర్లు, భీమారం మాజీ ఎంపిటిసి జల్లంపెల్లి తిరుపతి, మాజీ మండల యూత్ అధ్యక్షుడు పంతంగి సాయి కిరణ్, మాజీ గ్రామ అధ్యక్షుడు వేముల ప్రణీత్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం లాజర్, నాయకులు అజమీర విజయరాజు, యువ నాయకులు జగన్నాథుల రాజు, సుంకరి భూమేష్, చెవుల నరేష్, దారావత్ సారయ్య, దుర్గం రమేష్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, జరుగుతున్న అన్యాయాలను వేలెత్తి చూపితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ కరువైందని, ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతో అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుపెట్టకుండా పోలీసులతో అడ్డుకున్న ఘన చరిత్ర ఈ ప్రభుత్వానిదేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా భయపడేది లేదని, ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం, హామీల అమలు కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

