టేకు చెట్ల దొంగతనం కేసులో నలుగురు అరెస్ట్.. 132 టేకు దుంగలు స్వాధీనం.
జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 6.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామానికి చెందిన రైతు పొలంలో రెండు టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి దొంగిలించిన ఘటనపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి టేకు చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు అవైజ్, ఖాజీ రహమాన్ అలీ, అర్సద్, షౌకత్ అలీలుగా పోలీసులు తెలిపారు.
నిందితులు రాత్రి వేళల్లో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో టేకు చెట్లను గుర్తించి, ఎలక్ట్రిక్ రంపంతో నరికి ఆటోలో తరలించి, వివిధ పరిమాణాల్లో కోయించి గోదాముల్లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మేడిపల్లి, జగిత్యాల రూరల్, మల్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ టేకు చెట్ల దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.
నిందితుల నుంచి 132 టేకు దుంగలు, అశోక్ లేలాండ్ ఆటో, బైక్, ఎలక్ట్రిక్ రంపం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి వెల్లడించారు.
ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

