తిరుపతి,అర్జున్ సమాచారం:
.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం ఉదయం జరిగిన సింహ వాహనసేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు.
వాహనసేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లిన ఈవో, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, హైదరాబాద్, నెల్లూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఈవో ఆత్మీయంగా మాట్లాడారు.
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహనసేవ వీక్షణకు చేసిన ఏర్పాట్లపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడుతూ, భక్తులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆత్మీయతతో సేవలందిస్తూ, శ్రీవారి దర్శన అనుభూతిని మరింత ఆనందదాయకంగా తీర్చిదిద్దాలని అన్నారు.
టీటీడీ అందిస్తున్న వివిధ సేవలు, సౌకర్యాలను ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా స్పందించాలని సేవకులకు సూచించారు.
భక్తి, సేవ, ఆతిథ్యంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో తెలిపారు.
==========================

