కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ ‘ న్యాయ కళాశాల ‘ సెమినార్ హాల్ నందు “లీగల్ అవేర్నెస్ క్యాంప్” (న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు) కు సభాధ్యక్షత వహించి ఆచార్య కె. పద్మావతి కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు ఎల్ఎల్బి, ఎల్ ఎల్ ఎం కోర్సు యొక్క లక్ష్యాలు, ఉద్దేశ్యాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు డిజిటల్ యుగంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, న్యాయ కళాశాల తరగతులు గదుల్లో విజ్ఞానాన్ని నేర్చుకొని దేషాభివృద్ధికి బయలుదేరాలని సూచించారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ యశ్వంత్ సింగ్, డిఎస్ఎల్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ మానవ జీవితంలో చట్టాల ప్రాముఖ్యత, సాంకేతికతను, వనరులను సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ర్యాగింగ్ వంటి అవాంఛనీయ చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న సమాజంలో చట్టం అన్నింటినీ ప్రభావితం చేస్తుందని, ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో చట్టాలకు లోబడి నడుచుకోవాలని తెలిపారు.
సైబర్ క్రైమ్ విభాగం అధికారి మహేశ్ మాట్లాడుతూ డిజిటల్ నేరాలు, సైబర్ దొంగతనాలు, వ్యక్తిగత డిజిటల్ గోప్యత రక్షణపై సమగ్ర అవగాహన కల్పించారు.
యాంటీ డ్రగ్స్ జిల్లా విభాగ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు,ఆరోగ్యంపై భవిష్యత్తులో పడే పాక్షిక ప్రభావాల గురించి ప్రసంగించారు.
మహిళల రక్షణ గురించి స్వప్న, షీ టీమ్స్ అధికారి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, నేరాల అడ్డుకట్టకు ‘షీ టీమ్స్’ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్లుగా బి. అనిల్ సింగ్, పి. ప్రియ రాఘవేంద్ర వ్యవహరించగా, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, న్యాయశాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు అతిథులుగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు
==============================

