మోదీ జన్మదినం సందర్భంగా ఘనంగా ‘ఆశీస్సుల దీపం’ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుమోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు.
చెన్నూర్, సెప్టెంబర్ 17 (అర్జున్ సమాచారం):
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ .జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు గురువారం చెన్నూరు పట్టణంలో ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక చారిత్రక, ప్రాచీన శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తన సతీమణితో కలిసి పాల్గొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ‘ఆశీస్సుల దీపాలు’ వెలిగించారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ, ప్రపంచ యవనికపై భారతదేశ ఖ్యాతిని సమున్నతంగా నిలబెడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుడు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ప్రజా సేవలో పునరంకితం కావడానికి అవసరమైన మనోబలాన్ని ప్రసాదించాలని వారు భక్తిపూర్వకంగా ప్రార్థించారు. దేశ సంక్షేమం, శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చనలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల, పట్టణ శాఖల ముఖ్య నాయకులు, మోర్చాల ప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు, మోదీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తల విశేష భాగస్వామ్యంతో పట్టణంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు కోలాహలంగా ముగిశాయి.

