కళ్యాణిఖని ఓసీ వద్ద ప్రభావిత గ్రామస్తుల ఆందోళన .బ్లాస్టింగ్‌తో ఇళ్లకు పగుళ్లు.. దుమ్ము, ధూళితో అవస్థలు.
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 19 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి
- రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
మంచిర్యాల జిల్లా కాసిపేట, కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ గని బ్లాస్టింగ్ తమ జీవితాలను ఛిద్రం చేస్తోందంటూ కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు ఓసీ వద్దకు చేరుకుని గని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగుతూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు కేవలం 200 మీటర్ల సమీపంలోనే ఓపెన్‌కాస్ట్ ఏర్పాటు చేసి నిత్యం భారీగా బ్లాస్టింగ్ చేస్తుండటంతో ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతిని నివాసయోగ్యం కాకుండా మారాయని తెలిపారు. బ్లాస్టింగ్ తీవ్రతకు గోడలు కూలిపోతుండగా.. మరోవైపు ఓసీ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళితో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. బ్లాస్టింగ్ తీవ్రతను వెంటనే తగ్గించాలని, ఇళ్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేని పక్షంలో గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఓసీ పీవో రాంబాబు ఆందోళన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్వయంగా గ్రామాలను సందర్శించి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు జరుగుతున్న నష్టం, దుమ్ము–ధూళి సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళనలో మాజీ సర్పంచ్, ఏఐబీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సపాట్ శంకర్, ఉప సర్పంచ్ మల్యాల స్రవంతి, వార్డు సభ్యులు తోడేటి ప్రశాంత్, ఇస్లావత్ తిరుపతి, భూక్య పద్మ, చావన్ సురేష్, బూడద రమేష్, చిన్నతో పాటు గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

