హైదరాబాద్.అర్జున్ సమాచారం:
రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో విపరీతగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ ఉండేలా డిజైన్ చేయాలని సూచించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ముఖ్యమైన కాలనీల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణకు పెద్దపీట వేయాలన్నారు. క్యూర్ పరిధిలో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెరిగేలా, రహదారుల్లో సజావుగా రాకపోకలు సాగించేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానంతో రాకపోకలు మరింత సజావుగా సాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేకు వివిధ కాలనీలు, రహదారుల నుంచి వచ్చే రహదారులు కలిసే చోటుతో పాటు ఫ్రీ లెఫ్ట్, యూటర్న్‌ల విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు.
యూటిలిటీస్ తరలింపును వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయని, అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, పనుల చేపట్టే విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని చెప్పారు. శంకర్‌పల్లి-చేవెళ్ల మధ్య ఇప్పుడు ఉన్న రహదారుల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేందుకు వీలుగా పనులు చేపట్టాలని ఆదేశించారు. హై-రైజ్ బిల్డింగుల నిర్మాణం, ల్యాండ్‌స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన,వినయ్ కృష్ణారెడ్డి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
========================

