పట్టణ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్.
జయశంకర్ భూపాలపల్లి: అర్జున్ సమాచారం. డెస్క్, అక్టోబరు.17.
భూపాలపల్లి పట్టణంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా చేపట్టిన రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని,భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ కూడలి అభివృద్ధి నమూనా ప్రణాళికను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి బస్టాండ్ వరకు, అంబేద్కర్ జంక్షన్ నుంచి సింగరేణి గ్రౌండ్ మీదుగా కృష్ణ కాలనీ వరకు, అలాగే ఓసీ-2 మార్గంలో చేపట్టనున్న రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ రద్దీ, విద్యుత్ లైన్లు, తాగునీటి పైపులైన్ల మార్పిడి తదితర అంశాలను పరిశీలించారు. గతంలో పరిమిత జనాభాతో ఉన్న భూపాలపల్లి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నదని అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.. బొగ్గు, బూడిద, ఇసుక లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రోడ్ల విస్తరణ అత్యవసరమని తెలిపారు.
రోడ్ల విస్తరణకు రూ.70 కోట్లు, అమృత్ పథకం కింద రూ.23 కోట్లు
పట్టణంలో రోడ్ల విస్తరణ కోసం రూ.70 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి అమృత్ పథకం కింద రూ.23 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి, నాణ్యతా ప్రమాణాలతో పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి సింగరేణి గ్రౌండ్, కృష్ణ కాలనీ వరకు, ఓసీ-2 వైపు రోడ్ల విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.
సింగరేణి ప్రాంతంలో 1988లోనే 200 అడుగుల రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఓసీ-1, ఫైన్ ఇన్ క్లేన్ ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలని సూచించారు. కన్నం రాజయ్య ఇంటికి సంబంధించిన భూసేకరణ అంశం మినహా మిగతా ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. సదరు ఇంటి విషయంలో హైకోర్టు తీర్పు మేరకు అవసరమైన మొత్తాన్ని డిపాజిట్ చేసి, పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జంక్షన్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
పట్టణ సుందరీకరణలో భాగంగా అంబేద్కర్ కూడలిని ఆకర్షణీయమైన ఫౌంటెన్, ఆధునిక ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమీపంలోని జంక్షన్లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతానికి గద్దర్ జంక్షన్‌గా నామకరణం చేసే ప్రతిపాదనను పరిశీలించారు. హనుమాన్ జంక్షన్, రాజీవ్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, ఫైన్ క్లేన్ జంక్షన్, మంజూరునగర్ ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు సూచించారు.

