ప్రత్తిపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర ప్రమాదం:
నలుగురు సజీవ దహనం అర్జున్ సమాచారం, జూలై 01
ప్రత్తిపాడు
ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండల పరిధిలోని తుమ్మలపాలెం పంచాయతీ లిమిట్స్, బోయపాలెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిందిలా..
స్థానికులు మరియు వాహనదారుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట నుండి గుంటూరు వైపు (AP 39 WF 1959) నెంబరు గల లారీ వెళ్తోంది. ఈ క్రమంలో బోయపాలెం వద్ద రోడ్డు మధ్యలో డీజిల్ అయిపోయి ప్రమాదకరంగా ఆగి ఉన్న లారీ (AP 07 TC 8679)ని గమనించిన డ్రైవర్, దానిని తప్పించబోయాడు. సదరు ఆగి ఉన్న లారీ నిర్వాహకులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక (ఇండికేషన్) బోర్డులు పెట్టకపోవడంతో, వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లింది.
అదే సమయంలో గుంటూరు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్తున్న మరో లారీ (AP 02 TE 2679)ని ఈ లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. తీవ్రమైన ఘర్షణ కారణంగా రెండు వాహనాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
“కాపాడండి అన్న.. పిల్లలున్నారు” – డ్రైవర్ ఆర్తనాదాలు
ప్రమాదం జరిగిన వెంటనే లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఒక డ్రైవర్.. “అన్నా కాపాడండి.. మంటలు ఆర్పండి.. నాకు పిల్లలున్నారు అన్నా” అంటూ పెట్టిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేసాయి. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఏమీ చేయలేకపోయారు. ఫైర్ ఇంజన్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, క్యాబిన్లలో ఉన్నవారు సజీవ దహనమయ్యారని స్థానిక వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
స్తంభించిన ట్రాఫిక్ – సర్వీస్ రోడ్డుకు మళ్లింపు
జాతీయ రహదారిపై రెండు లారీలు తగలబడిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లించారు.

