విజయవాడ,అర్జున్ సమాచారం:
సమాచార హక్కు చట్టం 2005 ద్వారా వాస్తవ సమాచారం పొంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డి ప్రభుత్వ అధికారుల నుండి సమాచారం పొందుటకు అనర్హుడిగా మీడియా ద్వారా ప్రకటిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు ఉత్తర్వుల రద్దు కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్తామని న్యాయవాది సైకం రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో రాజశేఖర్ పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. అప్పిలుదారుడైన నాగార్జున రెడ్డి వాదనలను పరిగణనలోనికి తీసుకోకుండా, అవినీతి అధికారుల కొమ్ముకాసి, ఆధార రహితమైన ఆరోపణలతో ఉద్దేశపూర్వకంగా మీడియా ద్వారా నాగార్జున రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయు విధంగా వ్యవహరించిన కమీషనర్ తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారుల అక్రమాలు బహిర్గతం అవుతాయని భయంతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఇదే పద్ధతులు అనుసరిస్తే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టం 2005 కాస్త సమాచార ముప్పు చట్టం 2026 గా మారిపోయిందన్నారు.
దరఖాస్తుదారులు సమాచారం పొందకుండా నిషేధించేటువంటి అధికారం రాష్ట్ర సమాచార కమిషనర్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవ సమాచారం తెలుసుకునే హక్కు సమాచార హక్కు చట్టం 2005 కల్పిస్తోందని, కానీ ప్రస్తుత రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ అవినీతి అధికారులను కొమ్ముకాస్తూ , ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, ప్రశ్నించే వారిని అణిచివేయటమే లక్ష్యంగా పనిచేయడం సమాచార హక్కు చట్టాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనన్నారు.
చీరాలకు చెందిన ఆర్టీఐ కార్యకర్త తన్నీరు విజయ్ మాట్లాడుతూ ఇటీవల కొందరు అప్పీలు దారులపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచార హక్కు చట్టం కార్యకర్తలను సమీకరించి వివిధ రూపాలలో ఆందోళన చేపడుతామని, రాష్ట్ర ప్రధాన కమిషనర్ ఎంత పోకడలను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సమాచార హక్కు చట్టం కార్యకర్తలు మారం రెడ్డి కొండలరావు, కోడె వెంకటస్వామి, పర్వతనేని హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
==============================
