మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు కార్పొరేషన్‌లో తీర్మానం చేయాలి,
గత పదేళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా స్పందన లేదు – బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్..
మంచిర్యాల:అర్జున్ సమాచారం ,నవంబర్ 26 .మంచిర్యాల డెస్క్…
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కోరారు. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించడంతో పాటు, అవసరమైన అనుమతులు మంజూరు చేసి కార్పొరేషన్ కౌన్సిల్‌లో అధికారిక తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, మహిళా విద్య, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన తన జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో సమూల మార్పు సాధ్యమని విశ్వసించి, మహిళలకు విద్య అందించేందుకు తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేతో కలిసి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్య, సామాజిక చైతన్యం ద్వారా అభివృద్ధి సాధించాలని పూలే ఆశించారని తెలిపారు. ఆయన ఆలోచనలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ఇలాంటి మహనీయుడి సేవలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచిర్యాల పట్టణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.
గత పది సంవత్సరాలుగా మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వివిధ సందర్భాల్లో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నామని నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందినప్పటికీ ఈ అంశంపై ఇప్పటివరకు అధికారికంగా అనుమతులు మంజూరు కాలేదని, కౌన్సిల్‌లో తీర్మానం కూడా చేయలేదని పేర్కొన్నారు. పదేళ్లుగా చేస్తున్న విజ్ఞప్తికి ఇప్పటికైనా పరిష్కారం చూపాలని కోరారు.

