రాజ్యాంగం, అంబేద్కర్ ఆశయాలను బీసీలు అర్థం చేసుకోవాలి బహుజన వర్గాల్లో సామాజిక చైతన్యం, ఐక్యత పెరగాలి.. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్….
అర్జున్ సమాచారం .నవంబర్ 26 . రామగిరి రిపోర్టర్.
హైదరాబాద్: భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను బీసీ వర్గాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని బహుజన వర్గాలన్నీ ఐక్యంగా సామాజిక చైతన్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం హాల్‌లో డాక్టర్ కదిరె కృష్ణ రచించిన ‘అద్వితీయ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పుట్ట మధూకర్, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంబేద్కర్‌ను రాజకీయాలకు పరిమితం చేయొద్దు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై జరుగుతున్న దాడులు, అవమానాలపై రచయిత కదిరె కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగం గొప్పతనం సమాజంలోని అన్ని వర్గాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించేందుకు తాము ముందుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కదిరె కృష్ణ చేసిన ప్రసంగాలు విన్నప్పటి నుంచే ఆయనను కలవాలనే ఆసక్తి కలిగిందని, తొలుత ఆయన అంగీకరించకపోవడంతో తగరం శంకర్‌లాల్ ద్వారా ఫోన్ చేయించి కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.
అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అవమానిస్తే, బీజేపీ పరోక్షంగా అవమానిస్తోందని ఆయన విమర్శించారు. రెండు జాతీయ పార్టీల వైఖరిలో అంబేద్కర్ విషయంలో పెద్దగా తేడా లేదని ఆరోపించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా అంబేద్కర్‌ను కేవలం ఎస్సీ వర్గానికే పరిమితం చేసే ధోరణి కొనసాగుతోందని, ఈ పరిస్థితిపై బీసీ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడు కాదని, దేశంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానేత అని ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీల్లో ఐక్యతతోనే సామాజిక మార్పు,
బీసీ వర్గాల్లో వివిధ కులాల మధ్య విభజన ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో ఐక్యత కనిపించడం లేదని పుట్ట మధూకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఎస్సీ వర్గాలు ఎదుర్కొన్న వివక్ష, సామాజిక అణచివేత అనుభవాల నేపథ్యంలో ఐక్యంగా ఉండాలనే చైతన్యం పెరిగిందని పేర్కొన్నారు. బహుజన వర్గాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను తెలుసుకోవాలని సూచించారు. అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు, ఆయన చేసిన పోరాటాలపై విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు.
తాను మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి విజయం సాధించానని తెలిపారు. రాజకీయ ప్రయాణంలో అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని చెప్పారు. ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం మంథని నియోజకవర్గంలో తన గురించే చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
మంథనిలో బహుజన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి…
మంథని నియోజకవర్గంలో బ్రాహ్మణుల ఆలోచనలు బహుజనుల ఆలోచనలను అణచివేస్తున్నాయని పుట్ట మధూకర్ ఆరోపించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా మంథనిలో పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి ఆలోచనా ధోరణులను రాజ్యాంగ స్ఫూర్తితో ఎదుర్కొంటామని పేర్కొన్నారు. తాము రాజ్యాంగాన్ని చేతబట్టి సామాజిక సమానత్వం కోసం ముందుకు సాగుతున్నామని తెలిపారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని, వాటిని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా బీసీ యువత అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన చేసిన కృషి, రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బహుజన వర్గాలు ఐక్యంగా ఉంటూ సామాజిక న్యాయం, సమానత్వం సాధించే దిశగా కృషి చేయాలని పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.

