స్వదేశీ ‘కామికేజ్’కు మరో బలంమ్యూనిషన్స్ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్ మధ్య కీలక ఒప్పందం
లోయిటరింగ్ మ్యూనిషన్, యూఏవీ వ్యవస్థల అభివృద్ధికి ఎంవోయూ
వార్‌హెడ్ సాంకేతికతలో ఎంఐఎల్ నైపుణ్యం..
యూఏవీ రూపకల్పనలో డ్రోగో ఏరోస్పేస్ సామర్థ్యం
హైదరాబాద్, సెప్టెంబరు 4: అర్జున్ సమాచారం ప్రతినిధి.
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (డీపీఎస్‌యూ) అయిన *మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)*తో డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసే మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణపై రెండు సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంపై ద్రోగో ఏరోస్పేస్ నుంచి డ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు ,ఎం ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ పూణే లో శుక్రవారం సంతకాలు చేశారు.
రెండు సంస్థల నైపుణ్యాలు ఒక్కటిగా..
ఈ భాగస్వామ్యంలో డ్రోగో ఏరోస్పేస్ యూఏవీ ప్లాట్‌ఫామ్ రూపకల్పన, అభివృద్ధి, తయారీతో పాటు సంబంధిత ఖాళీ పేలోడ్ హార్డ్‌వేర్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మరోవైపు ఎంఐఎల్ తనకు ఉన్న రక్షణ మందుగుండు సామగ్రి, వార్‌హెడ్ సాంకేతికతలోని నైపుణ్యాన్ని అందించనుంది.
ఎంఐఎల్ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఏడు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్నిర్మించినపుడు దీన్ని స్థాపించారు. భారత సాయుధ దళాలు, విదేశీ మిలిటరీలు, దేశీయ పౌర అవసరాల కోసం ఇక్కడ మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, రాకెట్లు, బాంబులను తయారు చేస్తారు. మ్యూనిషన్స్ డిజైన్, పేలుడు పదార్థ వ్యవస్థలు, పేలోడ్ ఫిల్లింగ్, ఫ్యూజింగ్, మాడ్యులర్ మ్యూనిషన్ అభివృద్ధి వంటి విభాగాల్లో ఎంఐఎల్ తన సాంకేతిక సామర్థ్యాన్ని ఒప్పందంలో భాగంగా వినియోగించనుంది.
యూఏవీ–మ్యూనిషన్ సమీకరణపై ఉమ్మడి కసరత్తు
రెండు సంస్థలు కలిసి మ్యూనిషన్–యూఏవీ సమీకరణ, స్థిర భద్రతా మూల్యాంకనం, ఫీల్డ్/రేంజ్ పరీక్షలు, నాణ్యతా ధ్రువీకరణ వంటి తదుపరి దశలపై పనిచేయనున్నాయి. దీంతో యూఏవీ ఇంజినీరింగ్, మ్యూనిషన్ సాంకేతికత, పేలోడ్ వ్యవస్థలు, రక్షణ రంగ ప్రమాణాలకు అనుగుణమైన సమీకరణ సామర్థ్యాలను ఒకే వేదికపైకి తీసుకురానున్నాయి

