భూ పరిహార చెల్లింపులో జాప్యం… ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశం
వికారాబాద్. ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 5.
వికారాబాద్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ పరిహార వివాదం సంచలన మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ రైతుకు చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికీ అందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వికారాబాద్ సీనియర్ సివిల్ కోర్టు… ఏకంగా ఆర్డీవో కార్యాలయంలోని కదిలే ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. కోర్టు బెలిఫ్ కార్యాలయానికి చేరుకుని జప్తు ప్రక్రియ చేపట్టగా, అనంతరం రెండు నెలల్లో రూ.61.29 లక్షల పరిహారం చెల్లిస్తామని అధికారులు రాతపూర్వక హామీ ఇవ్వడంతో జప్తు చేసిన వస్తువులను తిరిగి కార్యాలయ కస్టడీకే అప్పగించారు. 1986-87లో రైల్వే ప్రాజెక్టు కోసం రైతు శశాంక్ రెడ్డికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, అప్పట్లో గజానికి కేవలం రూ.50 మాత్రమే పరిహారం నిర్ణయించారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన రైతు… జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసి చివరకు గజానికి రూ.125 చొప్పున పరిహారం పొందే హక్కును సాధించుకున్నారు. అయినప్పటికీ పరిహారం చెల్లింపులో జాప్యం కొనసాగడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఈ భూ పరిహార పోరాటం ఇప్పుడు జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది

