ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణకాలయాపనకే మంత్రితో ఫొటోలు దిగుతున్న దుద్దిళ్ల.

కాలయాపనకే మంత్రితో ఫొటోలు దిగుతున్న దుద్దిళ్ల.

📰 Generate e-Paper Clip

కాలయాపనకే మంత్రితో ఫొటోలు దిగుతున్న దుద్దిళ్ల.

వ్యవసాయానికి కరెంటు, ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలి,లేకుంటే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తాం,
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్,

మంథని: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 9.

వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాల్సిన బాధ్యతను విస్మరించి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇతర మంత్రులతో ఫొటోలు దిగుతూ కాలయాపన చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అప్రకటిత విద్యుత్‌ కోతలు, ఎస్సారెస్పీ నీటి విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మంథనిలోని పాత పెట్రోల్‌ బంక్‌ సమీపంలో మంథని–కాటారం ప్రధాన రహదారిపై రైతులతో కలిసి పుట్ట మధూకర్‌ రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటపాటు సాగిన ఆందోళనతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పుట్ట మధూకర్‌ మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే పంటల సాగుకు భారీగా పెట్టుబడులు పెట్టారని, ప్రస్తుతం వరి పంట పొట్టదశకు చేరుకున్న సమయంలో విద్యుత్‌ కోతలు, నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, నేడు రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం, విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశాలపై ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల సమస్యల కంటే దోపిడీపైనే శ్రద్ధ ఉందని విమర్శించారు.

రైతుల పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కోరిన వెంటనే బీఆర్‌ఎస్‌ శ్రేణులు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న వారిపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయాలని, ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు విశ్రమించకుండా పోరాటం కొనసాగిస్తామని పుట్ట మధూకర్‌ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!