ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలి ,సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజన
అర్జున్ సమాచారం ఆగస్టు 18 ముత్తారం రిపోర్టర్.
వరి సాగుపైనే ఆధారపడకుండా రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, పూల తోటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మంథని డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. అంజని సూచించారు.
మచ్చుపేట గ్రామానికి చెందిన రైతు పందిళ్ల రామ్మూర్తి సాగు చేస్తున్న బంతి, సీతమ్మ పూల తోటను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు. పూల సాగు, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అంజని మాట్లాడుతూ, ఆరుతడి పంటల సాగుతో తక్కువ పెట్టుబడితో పంటలు పండించడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చన్నారు. కంది, పెసర, మినుము, నువ్వులు, బంతి, సీతమ్మ పూలు, కాకర, బీర, సొరకాయ, బెండ, అలసంద వంటి పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు నిరంతర ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
పంటల వైవిధ్యంతో భూమిని ఖాళీగా ఉంచకుండా సద్వినియోగం చేసుకోవచ్చని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని, బిందు సేద్యానికి కూడా రాయితీ లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు సుమారు రూ.23 వేల వరకు ఉందన్నారు.
జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF)లో భాగంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించే రైతులకు ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ శాఖ సిఫారసుల మేరకే వినియోగించాలని సూచించారు.
పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 పొందుతున్న రైతులు తమ సంబంధిత ఏఈఓల వద్ద ఫేషియల్ ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అంజని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జే. అనుష, ఏఈఓలు శశిధర్, మనీషా, కృషి సఖీలు సౌఖ్య, కోమలత, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

