సింగరేణి, ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో రాజాపూర్‌లో ఇళ్లకు ముప్పుప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు.
– రామగిరి డెస్క్, సెప్టెంబర్ 14 (అర్జున్ సమాచారం):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రాజపూర్ గ్రామంలో సింగరేణి మరియు ఆర్‌అండ్‌బీ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం స్థానికులకు శాపంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామంలోని దాదాపు 400 ఇళ్లు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరుతుండటంతో గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
అధికారుల అస్తవ్యస్త పనులతో ఇళ్లలోకి వరద నీరు
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు గ్రామం వైపు ముంచెత్తింది. నీటిని సాఫీగా బయటకు తరలించేందుకు గతం లోనే అధికారులు ముందు చూపుతో 50 సంవత్సరాల క్రితమే రోడ్డు క్రింద వంతెన నిర్మించారు, కానీ ఇప్పుడు ఉన్న అధికారులు మాత్రం కొత్తగా వేసిన రోడ్డు కింద పైపులైన్ వేసి వదిలేశారు. కానీ ఆ పైప్ లైన్ రోడ్డు ఎత్తుకు అనుసంధానం చేయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయి ఇళ్లలోకి పోటెత్తుతోంది. దీంతో ఇళ్ల గోడలు, పునాదులు దెబ్బతిని ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా కనీస స్పందన లేదని వారు వాపోతున్నారు.
రాజపూర్ నుండి గుంజపడుగు గ్రామాల వైపు వెళ్లే ఎస్సారెస్పీ కాలువను సింగరేణి అధికారులు సంక్షోభంలోకి నెట్టారు. ఎలాంటి సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో కాలువకు గండి తీసి పనులు చేసి అలాగే వదిలేశారు.
ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు సమాచార హక్కు చట్టం ద్వారా ఫిర్యాదు చేసినా, ఎస్సారెస్పీ అధికారులు సింగరేణి నుంచి వస్తున్న మామూళ్ల మత్తులో ఉండి కాలయాపన చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఈ గండి ద్వారా భారీగా మట్టి కొట్టుకొచ్చి కాలువలో పేరుకుపోతోంది. దీనివల్ల నీటి ప్రవాగానికి తీవ్ర ఆటంకం ఏర్పడి, వరద ఉధృతి పెరిగితే ఆ నీరు నేరుగా గ్రామంలోని ఇళ్లను ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, రాజపూర్‌లో తగినన్ని పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసి శాశ్వత వరద విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎస్సారెస్పీ కాలువకు అడ్డగోలుగా గండి కొట్టిన సింగరేణి అధికారులపై, వారికి కుమ్మక్కై వ్యవహరిస్తున్న ఎస్సారెస్పీ అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

