రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి..
అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.
బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఉనుక లారీ ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ భరత్ కూడా మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

