ePaper
Wednesday, November 25, 2026
ePaper
Homeఅంతర్జాతీయం33 హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం.

33 హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం.

📰 Generate e-Paper Clip

33 హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం.

న్యూయార్క్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హష్‌మనీ కేసులో ఊరట లభించే అవకాశం ఉంది. తనపై నమోదైన క్రిమినల్ కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలన్న ట్రంప్ అభ్యర్థనను మరోసారి పరిశీలించాలని రెండో సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సోమవారం ఆదేశించింది. దీంతో ఈ కేసులో అధ్యక్ష హోదాలో తనకు ఉన్న న్యాయపరమైన రక్షణ ఆధారంగా తీర్పును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మార్గం ఏర్పడింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అప్పీల్స్ కోర్టు ఈ మేరకు రెండు పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలన్న ట్రంప్ పిటిషన్‌పై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని దిగువస్థాయి ఫెడరల్ కోర్టును ఆదేశించింది. గతంలో ట్రంప్ అభ్యర్థనలను పలుమార్లు తిరస్కరించిన ఫెడరల్ జిల్లా జడ్జి ఆల్విన్ హెల్లర్‌స్టీన్ నిర్ణయాల్లో తప్పిదాలు ఉన్నాయని అప్పీల్స్ కోర్టు పేర్కొంది. కాగా, 92 ఏళ్ల హెల్లర్‌స్టీన్ గత నెల‌లో మరణించారు.
2024 మేలో న్యూయార్క్ జ్యూరీ.. అధ్యక్షుడు ట్రంప్‌ను 34 నేరారోపణల్లో దోషిగా నిర్ధారించింది. అడల్ట్‌ ఫిల్మ్‌ నటి స్టార్మీ డేనియల్స్‌కు చెల్లించిన 1.30 లక్షల డాలర్లకు సంబంధించిన వివరాలను దాచిపెట్టేందుకు వ్యాపార రికార్డులను తారుమారు చేశారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన అభియోగం. దీంతో నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ కేసులో ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదు. సోమవారం వెలువడిన తాజా ఉత్తర్వులతో న్యూయార్క్ రాష్ట్ర కోర్టులో కొనసాగుతున్న ట్రంప్ అప్పీల్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేసుపై ఫెడరల్ కోర్టు అధికార పరిధి తేలేవరకు రాష్ట్ర కోర్టుల్లో తదుపరి విచారణలు నిలిపివేయాలని ట్రంప్ తరఫు న్యాయవాది రాబర్ట్ గియుఫ్రా జూనియర్ కోరారు. ఈ మేరకు అప్పీల్స్ విభాగానికి ఆయన లేఖ రాశారు. ఫెడరల్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేయకపోతే రాష్ట్ర అప్పీళ్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు పట్టవచ్చని, ఆ తర్వాతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని గియుఫ్రా వాదించారు. మరోవైపు, కేసును రాష్ట్ర కోర్టులోనే కొనసాగించాలని మాన్‌హటన్ జిల్లా అటార్నీ కార్యాలయం తరఫున అప్పీళ్ల విభాగం చీఫ్ స్టీవెన్ వూ వాదించారు.

నిరుడు ఆగస్టులో ఫెడరల్ న్యాయమూర్తి హెల్లర్‌స్టీన్ ట్రంప్ అభ్యర్థనను మూడోసారి తిరస్కరించడంతో ఆయన రెండో సర్క్యూట్ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు కూడా కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయాలన్న ట్రంప్ అభ్యర్థనను హెల్లర్‌స్టీన్ తిరస్కరించారు. అయితే, గతంలో ఈ వ్యవహారాన్ని పరిశీలించిన అప్పీల్స్ కోర్టు.. అధ్యక్షుడి అభ్యర్థనకు సంబంధించిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో హెల్లర్‌స్టీన్ విఫలమయ్యారని పేర్కొంది. ఆయన అభ్యర్థనను మరోసారి సమీక్షించాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులపై ట్రంప్ న్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. అయితే, కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేయడం, అధ్యక్షుడికి ఉన్న రక్షణ ఆధారంగా తీర్పును రద్దు చేయడం వంటి అంశాలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!