మూడు అగ్రనేతల భేటీ…..
ముంబయి:నవంబరు 17, (అర్జున్ సమాచారం).
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ , రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ గురువారం భేటీ కాబోతున్నారు. వచ్చే వారం జరగనున్న ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ సమ్మిట్ సందర్భంగా ఈ ముగ్గురు ప్రపంచ నేతలు కలిసి చర్చలు జరపబోతున్నారు. చైనా టెక్ హబ్‌గా పేరొందిన షెంజెన్ నగరం దీనికి వేదిక కానుంది. ముగ్గురు అగ్రనేతలు కలవడం అనేది అరుదైన ఘట్టమే అయినప్పటికీ.. ఈ చర్చల వల్ల వచ్చే ఫలితం మాత్రం పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.గత ఏడాది అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరిగింది. అమెరికా సుంకాలు విధించగా.. చైనా కూడా ప్రతీకార సుంకాలు విధించింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఈ విబేధాలను పక్కనబెట్టి ఆయనకు జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు. ట్రంప్ ఇప్పుడు మరోసారి చైనా పర్యటనకు వెళ్తున్నారు.అమెరికా, రష్యా మధ్య అణ్వాయుధ ఒప్పందం ‘న్యూ స్టార్ట్’ ఫిబ్రవరిలో ముగిసింది. ఈ ఒప్పందాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని పుతిన్ కోరినప్పటికీ.. ట్రంప్ తిరస్కరించారు. దానికి బదులుగా చైనాను కూడా కలుపుకొని మరో కొత్త, మెరుగైన ఒప్పందాన్ని చేసుకుందామని ఆయన ప్రతిపాదించారు.అయితే అమెరికా, రష్యాల వద్ద చెరో 5 వేలకుపైగా అణ్వాస్త్రాలు ఉన్నాయి. చైనా దగ్గర 600 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, రష్యాతో పోలిస్తే తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలు తక్కువ కావడంతో.. ఈ రెండు దేశాలతో అణు ఒప్పందం చేసుకోవడం పట్ల చైనా ఆసక్తి చూపడం లేదు.పుతిన్, జిన్‌పింగ్ మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. 2013లో జిన్‌పింగ్ చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వీరిద్దరూ ఇప్పటి వరకు 40 సార్లకుపైగా కలుసుకున్నారు. చైనా, రష్యా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ట్రంప్, జిన్‌పింగ్ సైతం ఏడు సందర్భాల్లో భేటీ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జిన్‌పింగ్ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లారు.డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాతో డీజిల్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్నారు. మాస్కోపై ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్.. భారీగా ఇంధనం ఎగుమతి చేయడానికి రష్యాకు అవకాశం ఇచ్చారు. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతోనే ఇంధన ధరలు పెరుగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ అవుతుండటంతో.. తమ ప్రమేయం లేకుండానే ఉక్రెయిన్ ఒప్పందం గురించి చర్చ జరిగే అవకాశం ఉందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన చెందుతున్నారు.పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి 1989లో ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఏర్పాటైంది. ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేసియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్ఫీన్స్తోపాటు అమెరికా, కెనడా దేశాలు ఈ కూటమిలో వ్యవస్థాపక సభ్య దేశాలుగా ఉన్నాయి. 1991 నుంచి 1998 మధ్య చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, మెక్సికో, రష్యా, చిలీ, పెరూ, పాపువా న్యూ గినియా, వియత్నాం చేరడంతో సభ్య ఆర్థిక వ్యవస్థల సంఖ్య 21కి చేరింది.APECలో భారత్ సభ్యదేశం కాదు. ఈ కూటమిలో చేరేందుకు 1991లోనే భారత్ దరఖాస్తు చేసుకుంది. కానీ భారత్ హిందూ మహా సముద్ర ప్రాంత దేశమని, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశం కాదనే సాకుతో చేర్చుకోలేదు. దీంతో ఈ కూటమి సమావేశాలకు అథిగా ఆహ్వానిస్తే తప్పితే భారత్ హాజరు కావడం లేదు. 2014లో ప్రత్యేక అతిథిగా ఈ సమావేశానికి హాజరు కావాలని జిన్‌పింగ్ తొలిసారిగా ఆహ్వానించారు. అయితే ప్రధాని మోదీ హాజరు కాలేదు. 2023లో అమెరికా ఆతిథ్యం ఇచ్చిన సదస్సుకు కూడా భారత్‌కు ఆహ్వానం అందింది. ఆ సదస్సులో మోదీకి బదులుగా వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ హాజరయ్యారు. సమావేశాలు 2026 నవంబర్ 16-18 తేదీల మధ్య చైనాలో జరుగుతుండగా.. ప్రధాని మోదీ దాదాపు అదే సమయంలో పిలిప్ఫిన్స్ రాజధాని మనీలాలో జరగనున్న ఏసియాన్-ఇండియా సదస్సుతోపాటు ఈస్ట్ ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా ఈ సదస్సులకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ట్రంప్-జిన్‌పింగ్-పుతిన్ భేటీ కాబోతున్న షెన్జెన్, ఆసియాన్ సదస్సు జరగనున్న మనీలా నగరాల మధ్య దూరం 1200 కి.మీ. లోపే కావడం గమనార్హం.

