ఉక్రెయిన్ నుంచి మృతదేహం తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం సాయం,రూ.6 లక్షల ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి.
జగిత్యాల ప్రతినిధి :: అర్జున్ సమాచారం :: అక్టోబర్ 11.
ఉక్రెయిన్‌లో రష్యా రాకెట్ దాడిలో మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసి వావిలాల సుదర్శన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మృతదేహం తరలింపునకు ఆర్థిక సహాయం కోరుతూ బాధిత కుటుంబం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించింది.
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేస్తూ సెప్టెంబర్ 1న రష్యా రాకెట్ దాడిలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు రూ.6 లక్షలు చెల్లించాలని భారత రాయబార కార్యాలయం సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆర్థిక సహాయం కోసం మృతుడి భార్య వావిలాల భార్గవి, తల్లి గంగు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి అవసరమైన మార్గదర్శనం చేశారు.
‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని సందర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు 39 రోజులుగా ఎదురుచూస్తుండటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులతో మాట్లాడి, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి అధికారికంగా లేఖ రాశారు.
అదేవిధంగా, సీఎం ప్రజావాణి నోడల్ అధికారి కె. విద్యాసాగర్ ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌తో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించే అంశంపై దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, హస్నాబాద్ మాజీ సర్పంచ్ బత్తుల గంగాధర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాసరావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, గాజుల సంపత్ కుమార్, మలేసియా ఎన్నారై గాజెంగి రంజిత్, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి తదితరులు పాల్గొన్నారు.

