ఘనంగా సరస్వతి విద్యాలయం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం,25 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి బాల్య జ్ఞాపకాల నెమరువేత.. ఆటపాటలతో సందడి.
మంచిర్యాల, అర్జున్ సమాచారం, అక్టోబర్ 11:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కృష్ణ కాలనీలోని సరస్వతి విద్యాలయంలో పదో తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట చేరిన స్నేహితులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు.
పాఠశాల విద్యాభ్యాసం పూర్తయి 25 ఏళ్లు గడిచిన నేపథ్యంలో మంచిర్యాల సమీపంలోని గాంధారి వనంలో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. నాడు పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ జీవితాల్లో చోటుచేసుకున్న విశేషాలను పంచుకున్నారు.
ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ హోదాలు, స్థాయులు, భేదాభిప్రాయాలను పక్కనపెట్టి స్నేహబంధానికి ప్రాధాన్యమిచ్చారు. కొందరు ఎంఆర్ఓలుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుళ్లుగా, సింగరేణి ఉద్యోగులుగా పనిచేస్తుండగా, మరికొందరు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. అయినప్పటికీ చిన్ననాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ అందరూ కలిసిమెలిసి సందడి చేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, చిన్ననాటి స్నేహబంధం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా, జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా, పాత మిత్రులతో ఒకచోట చేరి పాత రోజులను గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. రోజంతా ఆటపాటలు, సరదా ముచ్చట్లతో ఆత్మీయ వాతావరణంలో గడిపారు.
భవిష్యత్తులోనూ ఇదే విధంగా తరచూ కలుసుకుంటూ స్నేహబంధాన్ని కొనసాగించాలని, అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. పాతికేళ్ల తర్వాత జరిగిన ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనం వారందరిలో ఆనందాన్ని నింపింది.

