ఖానాపూర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 28:
జాన్సన్ నాయక్ గారికి రాఖీ కట్టి రక్ష బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ఆడబిడ్డలు.
ఖానాపూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారికి బంజారా సోదరీమణులు, స్థానిక మహిళా కౌన్సిలర్లు, మలేషియా బాధిత కుటుంబ సభ్యులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, జాన్సన్ నాయక్ గారు తమ కుటుంబ సభ్యుడిగా, అన్నగా భావిస్తూ తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మలేషియా బాధిత కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి చేసిన సహాయాన్ని వారు గుర్తు చేసుకున్నారు.
“ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా, తోడబుట్టిన అన్నలా మా కుటుంబాలకు అండగా నిలిచిన జాన్సన్ అన్నయ్యకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయతలను ఎన్నటికీ మరువలేం. రక్షాబంధన్ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి మా సోదరభావాన్ని వ్యక్తం చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని మలేషియా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం భూక్యా జాన్సన్ నాయక్ గారు మాట్లాడుతూ, రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బంజారా సోదరీమణులు, మహిళలు తనకు రాఖీలు కట్టి చూపించిన ఆప్యాయత తనకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందని తెలిపారు.
“బంజారా సోదరీమణులతో పాటు ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, అవసరమైన సమయంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాను” అని జాన్సన్ నాయక్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తలారి భాగ్యలక్ష్మి, గురిజాల రామ, రాచకొండ స్వప్న, యమునూరి జ్యోతి తదితర మహిళలు పాల్గొని భూక్యా జాన్సన్ నాయక్ గారికి రాఖీలు కట్టారు. మహిళా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

