ఆర్‌జీ-3లో సింగరేణి స్థలం కబ్జా?రూ.కోటి విలువైన స్థలానికి ప్రహరీ నిర్మాణం.. అధికారుల తీరుపై అనుమానాలు.
పెద్దపల్లి:అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 27 | రామగిరి
సింగరేణి సంస్థ ఆర్‌జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీ కాలనీ నగరం నడిబొడ్డున ఉన్న విలువైన సింగరేణి స్థలం ఆక్రమణకు గురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వకీల్‌పల్లి ఫాట్ల సమీపంలో ఉన్న స్థలం చుట్టూ రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు నిర్మించి, సుమారు రూ.కోటి విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి సంస్థ తమ భూముల పరిరక్షణలో భాగంగా మారుమూల ప్రాంతాల్లోని స్థలాలకు సైతం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపడుతుండగా, నగరం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం ఆక్రమణకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై స్థానికులు సింగరేణి అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
సింగరేణి స్థలాల పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, విలువైన స్థలంలో ప్రహరీ నిర్మాణం జరుగుతున్న విషయం అధికారుల దృష్టికి రాకపోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని సింగరేణి స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న అధికారులు, జీఎం కార్యాలయానికి సమీపంలో ఉన్న ఈ స్థలానికి ఎందుకు రక్షణ చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ స్థలం ఆక్రమణకు గురైనట్లు వస్తున్న ఆరోపణలపై సింగరేణి ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
సింగరేణికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. స్థలం సింగరేణి సంస్థకు చెందినదా? ప్రహరీ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆక్రమణ జరిగితే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

