నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఆనంది
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 27/. కమాన్ పూర్. డెస్క్.
కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది నేషనల్ జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. హనుమకొండలోని జేఎన్‌ఎస్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-18 విభాగంలో 400 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం విభాగాల్లో ఆనంది బంగారు పతకాలు సాధించింది.
ఈ ప్రతిభతో అక్టోబర్ 23 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం చెన్నైలో నిర్వహించనున్న జాతీయ స్థాయి జూనియర్స్ పోటీలకు ఆమె ఎంపికైంది. ప్రస్తుతం ఆనంది కమాన్‌పూర్ మండలం గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తాను పాల్గొన్న పలు పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ బంగారు పతకాలు సాధిస్తున్న ఆనందిని క్రీడా అభిమానులు అభినందించారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు ఆనందిని అభినందించారు.

