దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి.
అర్జున్ సమాచారం,నవంబర్ 22.మంథని రిపోర్టర్….
విన్నూత్నంగా వాల్ రైటింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
మంథని: ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్లో నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ బహిరంగ సభకు మంథని నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.
ఆదివారం మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురిలో దీక్షా దివస్ సభకు సంబంధించిన వాల్ రైటింగ్ను ఆయన వినూత్నంగా రాశారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ ద్వారా నేటి యువతకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నాం, రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఎలా సాగింది, గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో ఏం జరుగుతుందనే అంశాలను యువతకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
దీక్షా దివస్ ప్రారంభమైన సమయంలో జన్మించిన నేటి యువతకు తెలంగాణ ఉద్యమం ఎలా సాగింది, ప్రత్యేక రాష్ట్రం ఎలా సాకారమైందనే విషయాలు పూర్తిస్థాయిలో తెలియవని పేర్కొన్నారు. చరిత్రను తెలుసుకున్నవారే భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 29న అలుగునూర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు మంథని నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పుట్ట మధూకర్ కోరారు.

