కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు తప్పిదాలకు ఆస్కారం లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
ఈ నెల 30న ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్యూరిటీ అధికారులు, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి హెలిప్యాడ్, నూతన కలెక్టరేట్ భవనం, కలెక్టరేట్ పరిసరాలను తనిఖీ చేశారు. సిపి,సీఎమ్ఓ అధికారులతో పర్యటనకు సంబంధించిన పలు విషయాలను చర్చించారు.
అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. వివిధ శాఖల అధికారులు తమ కేటాయించిన విధులను సమన్వయంతో తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.నిర్దిష్ట సమయంలో పనులు పూర్తి చేయాలని,ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వరాదని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యంగా రోడ్లు భవనాలు, అటవీ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు.వారికి కేటాయించిన విధులను పూర్తి చేసి సర్టిఫై చేయాలని ఆదేశించారు.
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు:
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం:
సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఉంటుందని తెలిపారు. హెలిపాడ్, సీఎం కాన్వాయ్, గౌరవ వందనం, సెక్యూరిటీ తదితర అంశాలపై పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం మొదలుకొని తిరిగి హెలికాప్టర్ బయలుదేరే వరకు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులంతా తమకు కేటాయించిన విధులు నిర్వహించాలని, పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం విధులు కేటాయించిన రోప్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు ప్రముత్తంగా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అవసరమైన చోట భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, సీఎంఓ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు ఎస్పీ రామచందర్ రావు, డిఎస్పి శ్యామ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
=========================

