అమరావతి,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగల్తూరు ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందు మరోసారి సమీక్షించారు. విద్యుత్, రహదారులు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పురోగతిని అధికారులు వివరించారు. విద్యుత్ పునరుద్దరణలో ఇతర రాష్ట్రాల నుంచి సహకారం తీసుకుని పనులు వేగవంతం చేసారు. ఇంకా ఇబ్బందులున్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. చివరి వ్యక్తికీ సహాయం అందే వరకూ విశ్రమించేది లేదని చంద్రబాబు అన్నారు.
ప్రతిశాఖలో గ్రామ స్థాయిలో జరుగుతోన్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. చివరి వ్యక్తికి సహాయం అందే వరకు, సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు ఇదే సంకల్పంతో పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం స్వయంగా క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడుతుండటంతో యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం పనులు పూర్తి చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేటి ఉదయం 10 గంటల వరకూ ఉన్న పరిస్థితులను సమీక్షలో సీఎం చంద్రబాబుకు అదికారులు వివరించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థల పునరుద్ధరణతో ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు వివిధ శాఖలు క్షేత్రస్థాయిలో పనులు కొనసాగిస్తున్నాయి. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిన 5,404 గ్రామాల్లో 4,881 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. సుమారు 90 శాతం గ్రామాల్లో విద్యుత్ తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రభావితమైన 552 సబ్స్టేషన్లలో 513 పునరుద్ధరించారు. సుమారు 93 శాతం పునరుద్ధరణ పూర్తికాగా, మరో 39 సబ్స్టేషన్లు పునరుద్ధరించాల్సి ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాలన్నింటికీ సరఫరా పునరుద్ధరించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ప్రభావితమైన 509 ప్రధాన 33 కేవీ ఫీడర్లలో 489, అలాగే 2,958 గ్రామీణ, స్థానిక సరఫరాకు సంబంధించిన 11 కేవీ ఫీడర్లలో 2,355 పునరుద్ధరించారు. తీవ్ర ప్రభావం పడిన కోనసీమలో 316 గ్రామాలకు గాను 87 గ్రామాల్లో, పశ్చిమ గోదావరిలో 318 గ్రామాలకు గాను 154 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించారు. ఈ రెండు జిల్లాల్లోనే ఇంకా 393 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. కృష్ణా జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ప్రభావితమైన 915 గ్రామాల్లో 867 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించారు. మొబైల్ సమాచార సేవల పునరుద్ధరణలోనూ పురోగతి. వివిధ సంస్థలకు చెందిన 1,045 ప్రభావిత మొబైల్ టవర్లలో 661 పునరుద్ధరించారు. మరో 384 టవర్ల పునరుద్ధరణ మిగిలి ఉంది. ఆర్ అండ్ బీ రహదారులపై కూలిన మొత్తం 2,270 చెట్లను తొలగించారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1,334 చెట్లను తొలగించి రహదారులపై అడ్డంకులను తొలగించారు. ఆర్ అండ్ బీ రహదారులపై 137 చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, 119 చోట్ల రాకపోకలను పునరుద్ధరించారు. తుఫాను కారణంగా 2,425.45 కిలోమీటర్ల దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రహదారులు. శ్రీకాకుళంలో ఒక చోట నీటి ప్రవాహం కారణంగా ఒకవైపునే రాకపోకలు సాగుతున్నాయి. జలవనరుల శాఖ పరిధిలో ప్రభావితమైన 78 చెరువులు, 22 కాలువలు కలిపి మొత్తం 100 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పూర్తయింది. 16 జిల్లాల్లో 3,52,254 హెక్టార్లలో వ్యవసాయ పంటలు ముంపునకు గురయ్యాయి. ఉద్యాన పంటలు 23,211 హెక్టార్లలో ప్రభావితమయ్యాయి. టనష్టంపై రాష్ట్రానికి కేంద్ర బృందాలు…వాస్తవ పరిస్థితులు వివరించి పంట నష్టంపై కేంద్ర సాయం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు వర్షాల వల్ల రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు వచ్చినట్లు అంచనా….ఇంకా కొనసాగుతోన్న వరద ప్రవాహాలు సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లలో 4.68 టీఎంసీల నీరు అదనంగా చేరింది. మరో 5–6 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉంది. చిన్న నీటిపారుదల చెరువుల్లోకి 22 టీఎంసీల నీరు చేరింది. మరో 8–12 టీఎంసీల నీరు చేరే అవకాశం వుంది. భూగర్భ జలాలు 44 టీఎంసీల మేర పెరిగాయి. రాబోయే ఐదు రోజుల ప్రవాహ అంచనాల్లో గొట్టా బ్యారేజీకి 16.24 టీఎంసీలు, మడ్డువలసకు 12.01 టీఎంసీలు వచ్చే అవకాశం వుంది.

