ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeఆరోగ్యంమహిళల్లో కొలెస్ట్రాల్ సమస్యలు...

మహిళల్లో కొలెస్ట్రాల్ సమస్యలు…

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
భారతీయుల ఆరోగ్యంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఇండియా డయాబెటిస్ (ఐసీఎంఆర్‌-INDIAB) నిర్వహించిన జాతీయ స్థాయి అధ్యయనంలో అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ప్రతి 10 మంది వయోజనుల్లో దాదాపు 9 మంది (87.3 శాతం) ఏదో ఒక రకమైన ‘డైస్లిపిడెమియా’తో బాధపడుతున్నారని ఈ సర్వే తేల్చింది. డైస్లిపిడెమియా అంటే రక్తంలో కొవ్వుల (లిపిడ్స్) నిష్పత్తి అసాధారణంగా ఉండటం. సాధారణ భాషలో చెప్పాలంటే.. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్ ( హెచ్‌డీఎల్‌) తక్కువగా ఉండటం. ఇది గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమవుతుంది.ప్రఖ్యాత ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ లిపిడాలజీ’లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం దేశవ్యాప్తంగా 23,665 మంది నుంచి శాంపిల్స్ సేకరించి విశ్లేషించారు. ఈ సర్వే ఫలితాలు కొలెస్ట్రాల్ సమస్య అనేది కొద్దిమందికి మాత్రమే పరిమితమైనది కాదని, ఇది దేశవ్యాప్తంగా సర్వసాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయిందని స్పష్టం చేశాయి.
పట్టణం, పల్లె తేడా లేదు.. మహిళల్లోనే ఎక్కువ
ఈ అధ్యయనంలో మరికొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. కొలెస్ట్రాల్ సమస్య కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. పట్టణాల్లో 89 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లోనూ 86.5 శాతం మంది దీని బారిన పడ్డారు. అంటే, జీవనశైలితో సంబంధం లేకుండా ఈ ముప్పు విస్తరిస్తోందని అర్థమవుతోంది. ఇక లింగాల వారీగా చూస్తే, పురుషుల (83.5 శాతం) కంటే మహిళల్లోనే (91.1 శాతం) ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. భారతీయుల్లో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మంచి కొలెస్ట్రాల్ ( హెచ్‌డీఎల్‌-సీ) తక్కువగా ఉండటమేనని, జనాభాలో 66.8 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది.అధ్యయనంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువతపై దీని ప్రభావం. పాశ్చాత్య దేశాల్లో 50-60 ఏళ్ల వయసులో కొలెస్ట్రాల్ సమస్యలు తీవ్రమవుతుండగా, భారతదేశంలో కేవలం 30-39 ఏళ్ల వయసులోనే ఇది గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. అంటే, దేశానికి కీలకమైన యువత, పనిచేసే వయసులోనే గుండె జబ్బుల ముప్పును ఎదుర్కొంటున్నారని ఇది హెచ్చరిస్తోంది.
ఆరోగ్యంగా ఉన్నామనే భ్రమ వద్దు
ఈ సర్వేలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఎలాంటి డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం లేని, ఆరోగ్యంగా ఉన్నామని భావించే వారిలో కూడా 40 శాతం మందికి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్ ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి, పైకి ఆరోగ్యంగా కనిపించినంత మాత్రాన గుండె జబ్బుల ముప్పు లేదని భావించడానికి వీల్లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, ఊబకాయం ఉన్నవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని కూడా అధ్యయనం పేర్కొంది. కేవలం ప్రమాదంలో ఉన్నవారికి మాత్రమే కాకుండా, చిన్న వయసు నుంచే అందరికీ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం గట్టిగా సిఫార్సు చేస్తోంది. రెగ్యులర్‌గా కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవడం ద్వారా ముప్పును ముందుగానే గుర్తించి, జీవనశైలి మార్పులు, అవసరమైన చికిత్సతో తీవ్రమైన గుండె జబ్బుల నుంచి తమను తాము కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!