సిద్దిపేట,అర్జున్ సమాచారం:
వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణరావుపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, నాణ్యమైన విద్యుత్ అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం
చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల పంటలకు నీరందించడంలో ఇబ్బందులు ఏర్పడి, పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు రైతులకు 24 గంటల
నాణ్యమైన విద్యుత్ అందించాలి. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలి అంటూ నినాదాలు చేశారు. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు.
అనంతరం రైతుల ప్రతినిధులు నారాయణరావుపేట విద్యుత్ శాఖ ఏఈ గారిని కలిసి తమ సమస్యలను వివరించి, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ
మెమొరండం సమర్పించారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యుత్ సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా
వ్యవసాయానికి అవసరమైన మేరకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రైతుల తరఫున మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు.
==============================

