హైదరాబాద్, సెప్టెంబర్ 26,అర్జున్ సమాచారం:
తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో అధిష్టానం కీలక అడుగు వేసింది. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ వ్యూహకర్త సునీల్ బన్సల్‌నే మళ్లీ నియమిస్తూ, ఆయనకు సహకారంగా ఇద్దరు సహ
ఇన్‌ఛార్జులను కూడా రంగాంలోకి దించింది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, దాదాపు 35 శాతానికి పైగా ఓట్ షేర్ సాధించి కమలదళం చరిత్ర
సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏకైక ప్రత్యామ్నాయం తామేనన్న భావనను ప్రజల్లో బలంగా నాటడమే ప్రాథమిక లక్ష్యంగా బన్సల్ నాయకత్వంలో
కొత్త టీమ్ రంగంలోకి దిగుతోంది.ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వరుస పరాజయాలు, నాయకుల
వలసలు, అంతర్గత సంక్షోభంతో తీవ్రంగా కొట్టుమిట్టాడుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న సొంత కేడర్‌ను కాపాడుకునేందుకు ఆ పార్టీ గులాబీ అధినేతలు ఆపసోపాలు పడుతున్నారు. ఈ రాజకీయ శూన్యతను
పూర్తిగా వాడుకుని, బీఆర్‌ఎస్ ఆక్రమించి ఉన్న ద్వితీయ స్థానాన్ని తమ వశం చేసుకోవడం బన్సల్ టీమ్ ముందున్న అత్యంత ప్రధానమైన టాస్క్. తెలంగాణలో రాజకీయ పోరును ఇకపై కాంగ్రెస్ vs
బీజేపీ గా మార్చడమే వారి అసలైన వ్యూహం. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీని అట్టడుగు స్థాయి నుంచి విజయతీరాలకు చేర్చడంలో సునీల్ బన్సల్ పాత్ర అత్యంత కీలకం. బూత్ స్థాయి నెట్‌వర్క్
నిర్వహణలో మరియు ఆర్గానైజేషనల్ ప్లానింగ్‌లో ఆయన దిట్ట. గ్రౌండ్ లెవల్ పట్టును పెంచేందుకు ఆయన సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీజేపీ జెండా ఎగురవేస్తేనే,
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో బలమైన పునాది ఏర్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారు.అయితే బన్సల్ ముందున్న బాట అంత సులువేమీ కాదు. పార్లమెంట్
ఎన్నికల నాటి ప్రధాని మోదీ హవా, స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ పోరులో ఒకేలా పనిచేయదు. పైగా క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్లస్టర్ నాయకత్వం ఉన్నప్పటికీ, వివిధ జిల్లాల్లో పార్టీ విభేదాలు, ముఠా
తత్వాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి. సీనియర్లు, కొత్తగా చేరిన నేతల మధ్య సమన్వయం కుదర్చడం, పార్టీ ఐక్యతను చాటడం బన్సల్ ఇద్దరు సహ ఇన్‌ఛార్జులతో కలిసి అధిగమించాల్సిన అతిపెద్ద
పరిమితి. బీజేపీకి రాబోయే ఒక సంవత్సరం అత్యంత కీలకమైన టైమ్ విండో. వచ్చే ఏడాది కాలంలో పార్టీ తన శ్రేణులను ఏకీకృతం చేసి, నిరసనలతో ప్రజల్లో ఉంటూ పుంజుకోకపోతే, తెలంగాణ రేసులో
నిలవడం కష్టమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలు, పాలనా విధానాలను గట్టిగా ప్రశ్నిస్తూనే, బీఆర్‌ఎస్ స్పేస్‌ను సొంతం చేసుకోగలిగితేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది. లేనిపక్షంలో మళ్లీ ప్రాంతీయ
సమీకరణాలు పుంజుకునే అవకాశం ఉంటుంది.బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్‌కు డెరెక్ట్ టార్గెట్ బీజేపీనే అని బీజేపీ కేడర్ ట్రెండ్ చేస్తుంటే, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేరు, లోకల్ బాడీ ఎన్నికల
ఫలితాలు వేరని ప్రత్యర్థి పార్టీలు కౌంటర్ ఇస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, సునీల్ బన్సల్ రీ-ఎంట్రీతో తెలంగాణ బీజేపీకి సరికొత్త పొలిటికల్ బూస్టర్ డోస్ లభించిందనడంలో సందేహం లేదు. కానీ బీజేపీ
నాయకులు ఎంత మేర ఉపయోగించుకుంటారన్నదే కీలకం.
==================

