హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలని అన్నారు.
అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాము. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. – స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఉద్యమించారు. విలీనమా, విమోచనమా, విముక్తినా అనే చర్చ లేదు ఇది ముమ్మాటికి విముక్తినే. మనకు స్వేచ్ఛ ప్రసాదించిన రోజు. ఆనాడు వందేమాతరం అంటే జైల్లో పెట్టారు.. మూడు రంగుల జెండాను ఎత్తినందుకు పరకాలలో 26 మందిని చంపారు. ఒక పత్రిక పెట్టే స్వేచ్ఛ లేదు నిజాంకాలంలో. ఖాసిం రజ్వీ మన ఆడపిల్లల మీద చేసిన అఘాయిత్యాలు చెప్పనాలవి కావని అన్నారు.
నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది. – నిర్మల్ దగ్గర ఒక రాంజీ గోండు నిజాం సైన్యం మీద చేసిన పోరాటానికి 1857 లో వారిని బంధించి ఒకే చెట్టుకు వెయ్యి మందిని ఉరివేశారని అన్నారు.
=====================

