అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిజిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య.
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 16. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా:సెప్టెంబర్ 16, 2026:ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని కోటపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న సివిల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని, పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల రికార్డులను పరిశీలించడంతో పాటు ఆపార్ నమోదును, బేస్‌లైన్ పరీక్షల నివేదికలను పరిశీలించి, విద్యార్థుల విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
అనంతరం వేమనపల్లి మండలం కల్మల్‌పేటలోని యు.పి.ఎస్.ను సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న స్థానికులతో మాట్లాడి, నోటీసులకు సంబంధించిన వివరాలు, వారి అభ్యంతరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రక్రియపై అవసరమైన సమాచారం అందిస్తూ, అందిన అభ్యంతరాలు, సంబంధిత రికార్డులను నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులకు సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో స్థానిక సంస్థల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సమాఖ్య సంఘం భవనాల పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టి వర్షపు నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద గ్రామాలలో చేపడుతున్న మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యం, తడి–పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో వినియోగించాలని, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మండలంలోని వీధి దీపాల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజారం గ్రామంలో దశావతార విగ్రహాలను సందర్శించి స్థానికులతో మాట్లాడి విగ్రహాలకు సంబంధించిన చారిత్రక నేపథ్యం, ప్రాధాన్యత గురించి తెలుసుకున్నారు. మండలంలోని పశుసంవర్ధక, పశు జనన నియంత్రణ కేంద్రం లను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాధికారి, ఎస్‌ఐ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

