కరీంనగర్,అర్జున్ సమాచారం:
అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ (సీఆర్ఆర్టీ) అపర సంజీవనిలా పనిచేస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో సీఆర్ఆర్టీ యంత్రం పనితీరు, దాని ప్రయోజనాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల్లో మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నప్పుడు సీఆర్ఆర్టీ ఎంతో కీలకంగా ఉలపయోగపడుతుందని వివరించారు. బీపీని మెయింటెన్ చేసే మందులతో 24 గంటలు డయాలసిస్ చేస్తూ ప్రాణాపాయం నుంచి కాపాడే మిషనే సీఆర్ఆర్టీ అని తెలిపారు. సాదారణ డయాలసిస్ను తట్టుకోలేని రోగులకు ఈ అత్యాధునిక చికిత్స విధానం నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తుందని తెలిపారు. దీంతో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాలపై ఒత్తిడి తగ్గి కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సీఆర్ఆర్టీ యంత్రం పనితీరు, చికిత్స విధానం, రోగులకు కలిగే ప్రయోజనాలను వైద్యులు వివరించారు. మెడికవర్ ఆసుపత్రిలో సీఆర్ఆర్టీ యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగించి పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను టీం వర్క్తో కాపాడగలిగామని వైద్యులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, ఈ సాంకేతికత ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్టు డాక్టర్ రాంచందర్, క్రిటికల్ కేర్ నిపుణుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, మనోజ్, వకీల్ తదితరులు పాల్గొన్నారు.

